Prostate Cancer Symptoms : పురుషులకు ప్రాణాంతకమైన ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు భారతదేశంలో ఎక్కువవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కలు హెచ్చరిస్తున్నాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబరును ప్రొస్టేట్ క్యాన్సర్ అవగాహనా నెలగా పాటిస్తున్నారు. 50 ఏళ్ల లోపు వయసున్నవారు ఈ క్యాన్సర్ బారిన పడటమూ ఎక్కువవుతోందని డబ్ల్యూహెచ్‌వో లెక్కల తెలియజేస్తున్నాయి. పైగా దాని తీవ్రత అనేది సాధారణం కంటే మించి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మిగిలినవాటితో పోలిస్తే ప్రొస్టేట్ క్యాన్సర్ నెమ్మదిగా విస్తరిస్తుందని, ఈ సమస్యలను మొదట్లోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని వెల్లడిస్తున్నారు. సాధారణంగా ఈ వ్యాధి గతంలో వృద్ధులలో మాత్రమే కనిపించేది. కానీ, ప్రస్తుతం యువకులను, మధ్య వయస్కులనూ కబళిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మెట్రోపాలిటన్‌లలో నివసించే 35-44 మధ్య వయసున్న వారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ బాధితులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2022లో భారత్‌లో 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదకాగా.. అందులో ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు 37,948 గా నమోదయ్యాయి. ఈ లెక్క మొత్తం క్యాన్సర్ కేసుల్లో 3 శాతం కావడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎలా గుర్తిస్తారు? : ప్రోస్టేట్ క్యాన్సర్ సంకేతాలను మూత్ర సంబంధ లక్షణాలతో ముడిపెడుతుండటం మూలంగా దీన్ని గుర్తించటం ఆలస్యమవుతోందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ప్రోస్టేట్ గ్రంథి ఉబ్బినప్పుడు మూత్రం తరచూ రావటం నిజమే అని. కానీ క్యాన్సర్ కణితుల్లో ఇది అరుదేనని చెబుతున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌లో ప్రోస్టేట్ గ్రంథి చిన్నగానే ఉంటోందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. నిజానికి మూత్ర సంబంధ లక్షణాలు లేకపోవటం కూడా క్యాన్సర్ ఉందనటానికి పెద్ద సంకేతమని ఒక అధ్యయనం చెబుతోంది. అందువల్ల తరచూ మూత్రం రావటం వంటి లక్షణాలు లేనంత మాత్రాన ప్రోస్టేట్ క్యాన్సర్ లేదనే భరోసా పెట్టుకోకుడదని పరిశోధకులు సూచిస్తున్నారు. రక్తంలో ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ ( పీఎస్‌ఏ ) మోతాదులను ఆధారంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను గుర్తిస్తారు. అయితే, ఇది అన్నిసమయాల్లో కచ్చితంగా జబ్బును తెలియజేయలేదని నిపుణులు చెబుతున్నారు. పీఎస్‌ఏ మోతాదుల కన్నా దీని సాంద్రతే మరింత కచ్చితంగా క్యాన్సర్‌ను పట్టిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే, ఇలాంటివారికి ప్రోస్టేట్ గ్రంథి నుంచి చిన్న ముక్క తీసి పరీక్షిస్తే సమస్య ఉన్నదీ లేనిదీ బయటపడుతుందని నిపుణలు చెబుతున్నారు.
గుర్తించడంలో ఆలస్యం! : సమస్యను వీలైనంత తొందరగా గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి బయటపడొచ్చని ఆంకాలజిస్ట్ డా.ఆశిష్ గుప్తా వెల్లడించారు. ''క్యాన్సర్ నుంచి బతికి బయటపడటమనేది... మనం దానిని ఎంత త్వరగా గుర్తించాం అనే దానిపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్ శరీరంలో చాలా నెమ్మదిగా విస్తరిస్తుందని, కాబట్టి తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్యే ఉండదని సూచిస్తున్నారు. అమెరికాలో 80 శాతం మంది బాధితులు ఈ సమస్యను గుర్తించి తొలి దశలోనే చికిత్సకు వస్తున్నారని చెప్పారు. 20 శాతం మందే ముదిరిపోయిన తర్వాత డాక్టర్‌లను కలుస్తున్నారని వెల్లడించారు. భారత్‌లో దీనికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతోందని ఆశిష్ గుప్తా తెలిపారు. మూత్ర విసర్జన సమయంలో అసౌకర్యం, రాత్రుళ్లు పదేపదే లేవాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, నడుము లేదా జననాంగం వద్ద తీవ్రంగా నొప్పి పుట్టడం లాంటి లక్షణాలు ప్రొస్టేట్ క్యాన్సర్‌కు సూచనలని వెల్లడించారు. వ్యాయామం చేయడంతో పాటు పళ్లు, కూరగాయలను డైట్‌లో భాగం చేసుకోవాలని ఆశిష్ గుప్తా సూచించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ 'గుండె' ఎంతో స్పెషల్- జాగ్రత్తగా కాపాడుకోండి - Take Care of Your Heart
ముక్కులో కండ పెరిగితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?- ఎప్పుడు చికిత్స అవసరం? - Nasal Polyps Symptoms