Side Effects of Nail Polish in Telugu :మహారాణికి కిరీటింలా చేతుల అంచున గోళ్లను తళుక్కున మెరిసేలా చేస్తాయి. చేతుల అందానికి సరికొత్త సొబగులు అద్దుతాయి. ఐతే అందం వెనుక ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. గోళ్ల అందం కోసం తరచూగా నెయిల్ పెయింటింగ్ వేసుకుంటే వివిధ అనారోగ్య సమస్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు.
నెయిల్ పాలిష్ రెండు కోట్లు : పార్టీ, ఫంక్షన్ ఇలా శుభకార్యం ఏదైనా మేకప్ వేసుకునేందుకు మహిళలు మక్కువ చూపిస్తారు. ఇందులో గోళ్ల అలంకరణకు సైతం ప్రాధాన్యమిస్తారు. చీరలు, డ్రెస్స్‌లకు మ్యాచ్ అయ్యేలా వాటిని అలంకరించేందుకు శ్రద్ధ చూపిస్తుంటారు. గోళ్ల అందం కోసమే నెయిల్ పాలిష్, నెయిల్ టాటూ, నెయిల్ ఆర్నమెంట్స్ ఆర్టిఫీషియల్ నెయిల్స్, పాలిజెల్ నెయిల్స్ రోజుకో పద్ధతి పుట్టుకొస్తోంది. ఎక్కువగా నెయిల్ పాలిష్‌లే వినియోగించినా, నెయిల్ ఎక్స్ టెన్షన్లకు మంచి డిమాండ్ ఉంది. సాధారణంగా గోళ్ల రంగుల ఖరీదు 40 నుంచి 50 రూపాయల వరకు ఉంటుంది. కాస్త ఖరీదైనవైతే వందల నుంచి వేలల్లో ఉంటాయి. బ్లాక్ డైమండ్స్‌తో రూపొందించిన అజాచర్ నెయిల్ పాలిష్ ఏకంగా రెండు కోట్ల రూపాయల వరకు పలకింది. ఓ నెయిల్ పాలిష్ ఇంత ఖరీదులో తయారు చేశారంటేనే వీటికి ఉన్న డిమాండ్‌ని అర్థం చేసుకోవచ్చు.
అనారోగ్య సమస్యలు తల్లెత్తే ప్రమాదం :ఐతే ఈ అందం వెనుక ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. నెయిల్ ఆర్ట్‌లు, నెయిల్ పాలిష్‌లను తరచూ వేసుకోవటం, రిమూవర్స్‌ని వినియోగించటం అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. గోళ్లపై అందంగా స్ప్రెడ్ అవ్వటం, ఎక్కువ కాలం అతుక్కుని ఉండటం, కలర్, మెరుపుల కోసం నెయిల్‌పాలిష్‌లలో వివిధ రకాల రసాయనాలు వినియోగిస్తుంటారు. రంగుల్లో వాడే పారాబెన్స్ వల్ల హార్మోన్ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మానిక్యూర్ సమయంలో గోరు పైభాగంలో ఉండే క్యూటికల్ అనే పొర తొలగిపోయి బ్యాక్టీరియా, ఫంగస్ శరీరంలోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. చిన్నపిల్లలు రంగు వేసుకున్న వేళ్లను నోట్లో పెట్టుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు తల్లెత్తే ప్రమాదం ఉందంటున్నారు.
తల్లిబిడ్డ ఆరోగ్యానికి ప్రమాదం :నెయిల్ ఆర్ట్ సమయంలో వాడే లేజర్ లైట్లు చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ఎక్కువ సేపు నెయిల్ పాలిష్ వాసన పీల్చటం వల్ల శ్వాసకోస సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. గర్భిణులు తరచూ నెయిల్ పాలిష్ వేసుకోవటం వల్ల తల్లిబిడ్డ ఆరోగ్యానికి ప్రమాదం కలిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.