Side Effects of Late Night Eating: ప్రస్తుత రోజుల్లో బిజీ లైఫ్‌స్టైల్, లేట్ నైట్ జాబ్స్, పని ఒత్తిడి, పార్టీలు తదితర కారణాల వల్ల చాలా మంది రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేస్తుంటారు. మరికొంత మంది ఇలా తినడాన్ని ఓ అలవాటుగా చేసుకుంటారు. కానీ నైట్ టైమ్ ఆలస్యంగా భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆ ఆరోగ్య సమస్యలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జీర్ణ సమస్యలు :రాత్రి సమయంలో మన ఆహారపు అలవాట్లు జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో నైట్ టైమ్‌లో ఆహారాన్ని లేట్ తింటే అది సరిగా జీర్ణం అవ్వదని, దీంతో గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
బరువు పెరగడం: రాత్రిపూట భోజనం ఆలస్యంగా చేస్తే బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో జీవక్రియ మందగిస్తుందని, ఫలితంగా కేలరీలు సరిగ్గా బర్న్ అవ్వవని, దీంతో శరీరంలో ఫ్యాట్ పెరగడం ప్రారంభమవుతుందని అంటున్నారు. కాబట్టి భోజనానికి, నిద్రపోవడానికి మధ్య మూడు గంటల పైనే గ్యాప్ ఉండాలని సూచిస్తున్నారు. రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కాలక్రమేణా బరువు పెరిగే ప్రమాదం ఉందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు సంబంధించిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైంది(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
పెద్దపేగు క్యాన్సర్:ఆలస్యంగా రాత్రి భోజనం చేయొద్దని, ముఖ్యంగా కొవ్వులు, చక్కెరతో కూడిన ఆహారం ఎక్కువగా తినొద్దని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోవడానికి 3 గంటల్లోపు భోజనం చేసే వారిలో (వారానికి కనీసం నాలుగు రోజుల పాటు) పెద్దపేగు చివర (కొలోరెక్టల్) క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతున్నట్టు బయటపడింది. రాత్రి భోజనాన్ని తొందరగా తినేవారితో పోలిస్తే ఆలస్యంగా తినేవారికి చిన్న కణితి (అడినోమా) ఏర్పడే అవకాశం 46% ఎక్కువగా ఉంటున్నట్టు షికాగోలోని రష్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు.
స్ట్రోక్ పెరిగే ఛాన్స్ : రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాలక్రమేణా ఈ అలవాటు సెరెబ్రోవాస్కులర్ డిజార్డర్స్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.