తెలంగాణ

telangana

ETV Bharat / health

ఈ డ్రింక్స్ తాగేవారికి క్యాన్సర్ ముప్పు! - లివర్ దెబ్బతింటుందట! - రీసెర్చ్​లో వెల్లడి! - SIDE EFFECTS OF SWEET DRINKS

-స్వీట్స్​ డ్రింక్స్​ తాగేవారిలో కాలేయ క్యాన్సర్​తో సహా ఇతర సమస్యలు -పరిశోధనలో వెల్లడించిన నిపుణులు

Side Effects of Drinking Sweet Drinks
Side Effects of Drinking Sweet Drinks (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2024, 10:59 AM IST

Side Effects of Drinking Sweet Drinks:చాలా మందికి తియ్యగా ఉండే డ్రింక్స్​ అంటే ఇష్టం. కూల్​డ్రింక్స్​/సోడా.. ఇలా ఏదైనా ఇష్టంగా సేవిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు వీటిని ​తాగడానికి ఇష్టపడతుంటారు. అయితే ఇలా అదే పనిగా తియ్యటి పానీయాలు తాగేవారు అలర్ట్​ కావాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇలా స్వీట్​ డ్రింక్స్​ తాగడం వల్ల లివర్​ క్యాన్సర్​ వచ్చే ప్రమాదం ఉందని.. ముఖ్యంగా మహిళలకు ఈ ప్రమాదం ఎక్కువని నిపుణులు అంటున్నారు. తాజాగా దీనిపై పరిశోధనలు సైతం నిర్వహించారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఎలా హానికరం:స్వీట్​డ్రింక్స్‌లో చక్కెర స్థాయులు, ఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌‌, ఆర్టిఫిషియల్‌ ప్రిజర్వేటీవ్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఈ పదార్థాలు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి, శరీరంలో ఇన్సులిన్ శాతాన్ని తగ్గించడానికి, ప్రీ రాడికల్స్ ఉత్పత్తిని పెంచడానికి దారితీస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ పరిస్థితులు అన్నీ లివర్ క్యాన్సర్​కు దారితీసే అవకాశం ఉందని అంటున్నారు.

పరిశోధన వివరాలు ఇవే:ప్రతిరోజూ తీయటి పానీయాలు (స్వీట్‌ డ్రింక్స్‌) తీసుకునే మహిళలు కాలేయ క్యాన్సర్‌ బారిన పడే ముప్పు ఎక్కువగా ఉందని సౌత్​ కరోలినా విశ్వవిద్యాలయం, 'బ్రిగ్‌హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్' సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. సుమారు లక్ష మందికి పైగా పోస్ట్‌ మెనోపాజ్‌లో ఉన్న మహిళలపై అధ్యయనం చేయగా.. నెలకు మూడు, అంతకంటే తక్కువ చక్కెర పానీయాలు తాగే వ్యక్తులతో పోలిస్తే ప్రతిరోజూ ఒకటి, అంతకంటే ఎక్కువ స్వీట్​ డ్రింక్స్​ తాగే వ్యక్తులకు కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 78%, కాలేయ వ్యాధితో మరణించే ప్రమాదం 73% ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​కు సంబంధించిన నేషనల్​ లైబ్రరీ ఆఫ్​ మెడిసిన్​ కూడా ఇదే విషయాన్ని ప్రచురించింది(రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి).

షుగర్ , కాలేయ క్యాన్సర్ మధ్య సంబంధం ఉందని ఈ పరిశోధన ప్రధాన రచయిత లాంగ్ గ్యాంగ్ జావో వెల్లడించారు. ఎక్కువ చక్కెర ఉన్న పానీయాలను ప్రతిరోజూ తీసుకుంటే అది కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని.. కాలేయ క్యాన్సర్‌తో పాటు, కాలేయ సిర్రోసిస్, కాలేయ వైఫల్యం, దీర్ఘకాలిక హెపటైటిస్‌కు కూడా కారణమవుతుందని చెబుతున్నారు. అయితే ఈ పరిశోధన మరింత విస్తృతంగా చేయాల్సి ఉందని వెల్లడించారు.

ఈ సమస్యలు కూడా:స్వీట్​ డ్రింక్స్​ అధికంగా తాగడం వల్ల కేవలం కాలేయ క్యాన్సర్​ మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బందిపెడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్వర్డ్ మెడికల్​ స్కూల్​ ప్రకారం, రోజుకు 1 నుంచి 2 క్యాన్లు, అంతకంటే ఎక్కువ స్వీట్​ డ్రింక్స్ తాగే వ్యక్తులకు టైప్‌ 2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం 26% పెరుగుతుందని వెల్లడించింది. స్వీట్​ డ్రింక్స్​ను అధికంగా తీసుకోవడం వల్ల అధికబరువు, గుండె సమస్యల ముప్పు పెరుగుతుందని.. అలాగే వీటిలో ఉండే చక్కెర, యాసిడ్.. దంతాలపై ఎనామిల్‌ను తొలగించి.. దంతక్షయం, నోటి సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు.

కాలేయ క్యాన్సర్ లక్షణాలు:కాలేయ క్యాన్సర్ ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలూ ఉండవని.. వ్యాధి తీవ్ర రూపం దాల్చిన తర్వాత కొన్ని లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు. అవేంటంటే..
పొత్తికడుపు కుడి వైపున, పక్కటెముక కింద నొప్పి

  • కుడి భుజం దగ్గర నొప్పి
  • కామెర్లు
  • బరువు తగ్గడం
  • వికారం
  • ఆకలి లేకపోవడం
  • అలసట
  • ముదురు రంగు మూత్రం

NOTE:ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్ : మందులో కూల్​​డ్రింక్ మిక్స్ చేస్తున్నారా? మీ శరీరంలో జరిగే మార్పులివే!

కూల్​డ్రింక్ మిగిలితే పారబోస్తున్నారా? - దాని ఉపయోగాలు తెలిస్తే నోరెళ్లబెడతారు!

ABOUT THE AUTHOR

...view details