Sex During Pregnancy : గర్భంతో ఉన్నప్పుడు శృంగారంపై భార్యాభర్తల్లో చాలా మందికి అనేహ అపోహలు ఉంటుంటాయి. మనసులో సెక్స్ కోరికలు ఉన్నా, గర్భాస్రావం భయంతో వెనక్కి తగ్గుతుంటారు. కొంతమంది మరీ సుకుమారంగా వ్యవహరిస్తుంటారు. నిజానికి ఆరోగ్యానికి, దంపతుల మధ్య అనుబంధానికి కీలకమైనది శృంగారం. అటువంటిది దానిపై లేనిపోని అనుమానాలతో ఎక్కువగా భయపడుతుంటారు. అయితే గర్భంతో ఉన్నప్పుడు కొన్ని అరుదైన సందర్భాల్లో తప్ప, మిగిలిన సమయాల్లో సెక్స్‌లో పాల్గొనడంపై ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.
ఆ జోన్లో లేని వారే
ఇన్ఫెక్షన్స్ లాంటివి ప్రమాదకరమైన వ్యాధులు ఉన్నవారు, హైరిస్క్ జోన్లో ఉన్న గర్భిణులు తప్ప మిగిలిన వారు సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు అంటున్నారు. కొంతమంది గర్భంతో ఉన్నప్పుడు చాలా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. గర్భసంచికి సంబంధించిన సమస్యలు, బిడ్డ ఆరోగ్యానికి సంబంధించి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంటుంది. ఇలాంటి వారు సెక్స్‌కు దూరంగా ఉండటమే మంచిదని అంటున్నారు.
అంతేకాని మరీ సుకుమారంగా వ్యవహరిస్తూ, ఏ ఇబ్బంది లేకపోయినా, అడుగుతీసి అడుగు వేయడానికి భయపడేవారు కేవలం అపోహతోనే సెక్స్‌కు దూరంగా ఉంటారని వైద్యులు అంటున్నారు. నిజానికి గర్భంతో ఉన్నప్పుడు కూడా భార్యాభర్తల కలయిక వల్ల బిడ్ద ఎదుగుదల బాగుంటుందని కూడా డాక్టర్లు చెబుతున్నారు. అయితే పొట్టపై ఒత్తిడి లేకుండా కలుసుకోవడం ముఖ్యమన్న సంగతిని గమనించాలి.
అన్ని అపోహలే
గర్భం వచ్చాక శృంగారంలో పాల్గొంటే అబార్షన్ అవుతుందని, నెలలు నిండకముందే డెలివరీ వచ్చేస్తుందని కొంతమంది భయపడుతుంటారు. వాస్తవానికి ఈ రెండూ అపోహలే. కలయిక వల్ల వెజైనా వద్ద అసౌకర్యంగా ఉన్నా, నొప్పి వచ్చినా ఏదైనా దుష్ప్రభావం ఉంటుందేమోననే భయం కూడా ఉంటుంది. నిపుణులు చెప్పినదాని ప్రకారం కొన్నిసార్లు కలయిక వల్ల అసౌకర్యం, నొప్పి రెండూ సహజంగా వచ్చేవే. భార్యాభర్తలు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనడం మంచిదేనని వైద్యులు సూచిస్తున్నారు.