తెలంగాణ

telangana

దెబ్బతిన్న కిడ్నీలను కూడా బాగుచేయొచ్చట - వైద్యుల సంచలన పరిశోధన! - Kidney Health

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 5:28 PM IST

Reduce Salt For Kidney Health : ప్రస్తుత కాలంలో ఎంతో మంది కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నారు. అయితే, వీరు ఉప్పు తీసుకోవడం తగ్గించడం వల్ల దెబ్బతిన్న కిడ్నీ కణాలు పునరుజ్జీవం పొందుతున్నట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

Kidney Health
Reduce Salt For Kidney Health (ETV Bharat)

Low Sodium And Kidney Function :శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి. ఆహారం జీర్ణమయ్యే క్రమంలో ఏర్పడే మళినాలను, శరీరంలో జరిగే ఏ జీవక్రియలోనైనా ఏర్పడే వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడూ తొలగించి, శరీరాన్ని శుభ్రంగా ఉంచేందుకు కిడ్నీలు పనిచేస్తాయి. అయితే, ఇటీవల కాలంలో పలు కారణాల వల్ల చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా దెబ్బతిన్న మూత్రపిండాలు మళ్లీ ఆరోగ్యంగా మారితే ఎంత బాగుంటుంది ? తాజాగా అమెరికా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ఒకటి ఇలాంటి ఆశలే రేకెత్తిస్తోంది. ఈ రీసెర్చ్​లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఉప్పు తగ్గిస్తేనే..

ఎక్కువ మందిలో కిడ్నీ జబ్బుల లక్షణాలు త్వరగా బయటపడవు. దీనివల్ల కిడ్నీలు పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కిడ్నీలు ఫెయిల్ అయితే డయాలిసిస్, కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం లేదు. అయితే, దెబ్బతిన్న కిడ్నీల ఆరోగ్యంపై యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియాలోని కెక్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన డాక్టర్​ జానోస్‌ పెటి-పెటెర్డి బృందం అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులో పలు కీలక విషయాలను వారు వెల్లడించారు. ఈ పరిశోధనలో కొన్ని రోజుల పాటు ఉప్పు తక్కువున్న ఆహారం తినడం, శరీరంలో ద్రవాల మోతాదులు తగ్గించటం ద్వారా ఎలుకల కిడ్నీలోని కొన్ని కణాలు మరమ్మత్తు అవుతున్నట్టు, పునరుజ్జీవం పొందుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

మూత్రపిండాల్లోని మాక్యులా డెన్సా అనే భాగంలోని కణాలు ఇందుకు సహాయం చేస్తున్నాయని కనుగొన్నారు. ఈ కణాలు ఉప్పును గుర్తించటం, రక్తం వడపోత, హార్మోన్ల విడుదల వంటి కీలకమైన పనులను నిర్వర్తిస్తాయి. అయితే, వీటి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ దెబ్బతిన్న కిడ్నీ కణాల పునరుజ్జీవంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఈ అధ్యయనంలో దెబ్బతిన్న కిడ్నీలు పునరుజ్జీవం కావటంలో ఎందుకు విఫలమవుతున్నాయో అనే దానికి బదులుగా.. అసలు కిడ్నీలు ఎలా పరిణామం చెందాయో తెలుసుకోవటానికి పరిశోధకులు ప్రయత్నించారు. చేపల్లోని ఆదిమ కిడ్నీల నిర్మాణం క్రమంగా ఉప్పు, నీటిని మరింతగా సంగ్రహించుకునేలా సమర్థంగా తయారైంది.

జీవులు ఉప్పుతో కూడిన సముద్రం నుంచి పొడి వాతావరణంలోకి విస్తరించే క్రమంలో ఈ ప్రక్రియ తప్పనిసరైంది. ఇందులో భాగంగానే క్షీరదాలు, పక్షులు మూత్రపిండాల్లోని మాక్యులా డెన్సా భాగం ఏర్పడింది. తర్వాత.. జీవుల మనుగడకిది తోడ్పడింది. ఈ పరిశోధనలో ఎలుకలకు రెండు వారాల పాటు తక్కువ ఉప్పు ఆహారం.. అలాగే ఉప్పు, ద్రవాలను మరింత తగ్గించే ఏసీఈ ఇన్‌హిబిటార్‌ రకం మెడిసిన్​ ఇచ్చారు. దీంతో మాక్యులా డెన్సా కణాల పునరుజ్జీవం మొదలైందని కనుగొన్నారు. ఈ భాగం నుంచి వచ్చే సంకేతాలను నిలువరించే మెడిసిన్​తో పునరుజ్జీవ ప్రక్రియను అడ్డుకోవచ్చని కూడా బయటపడింది.

అంటే కిడ్నీ కణాల మరమ్మతులో మాక్యులా డెన్సా కీలక పాత్ర పోషిస్తున్నట్టు వెల్లడైంది. ఈ కణాలను పరిశోధకులు విశ్లేషించగా వీటి జన్యు, నిర్మాణాలు నాడీ కణాలను పోలి ఉన్నట్టు గుర్తించడం ఆశ్చర్యకరం. ఎందుకంటే.. చర్మం వంటి ఇతర భాగాల పునరుత్తేజంలో నాడీ కణాలు కీలక పాత్ర పోషిస్తాయి మరి. ఉప్పు తక్కువ ఆహారంతో ఎలుకల్లో సీసీఎన్‌1 వంటి కొన్ని ప్రత్యేక జన్యువుల నుంచి వెలువడే సంకేతాలు పెంపొందుతున్నట్టూ పరిశోధకులు గుర్తించారు. దీర్ఘకాల కిడ్నీ జబ్బు బాధితుల్లో సీసీఎన్‌1 జన్యువు పనితీరు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ రీసెర్చ్​ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉప్పును తగ్గిస్తే ఈ జన్యువు పనితీరు మెరుగయ్యే అవకాశమున్నట్టు ఈ అధ్యయనం సూచిస్తోంది.

NOTE :ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

అలర్ట్ : కిడ్నీలు ఫెయిల్‌ అయ్యే ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి! - లైట్‌ తీసుకుంటే అంతే!

అలర్ట్ : కాళ్ల వాపు కిడ్నీ ఫెయిల్యూర్​కు సంకేతమా? - నిపుణుల మాటేంటి?

కిడ్నీ క్యాన్సర్ : ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా అలర్ట్ అవ్వండి - ప్రాణాలకే ప్రమాదం!

ABOUT THE AUTHOR

...view details