Belly Fat Causes :ఇటీవల కాలంలో చాలా మంది పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోయి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవడానికి రకరకాల వ్యాయామాలు డైట్ పాటించినా కూడా, కొందరిలో పొట్ట తగ్గదు..! బెల్లీ ఫ్యాట్ అధికంగా ఉండడం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, చాలా మందికి అసలు పొట్ట ఎందుకు వస్తుందో తెలియదు ? ఎక్కువగా తినడం వల్లే బెల్లీ ఫ్యాట్ వస్తుందని అనుకుంటుంటారు. అయితే, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడానికి చాలా కారణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మీకు తెలుసా ? ఈ స్టోరీ తెలుసుకుందాం.
వ్యాయామం చేయకపోవడం :
ప్రస్తుత ఆధునిక యుగంలో మెజార్టీ ప్రజలు వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు. దీనివల్ల అనారోగ్యకరమైన బరువు పెరుగుతారు. రోజూ ఎక్సర్సైజ్లు చేయకపోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుందని నిపుణులంటున్నారు.
మంచి డైట్ పాటించకపోవడం :
పొట్ట చుట్టూ కొవ్వు పెరగడానికి ప్రధానం కారణం సరైన డైట్ పాటించకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది రోజువారీ అవసరాలకు మించి క్యాలరీలు అధికంగా ఉండే ఆహారం తింటారు. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుందని నిపుణులు అంటున్నారు.
అధికంగా మద్యం సేవించడం :
మద్యంలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. మనం అధిక మోతాదులు ఆల్కాహాల్ సేవించినప్పుడు శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. అలాగే మందు తాగుతున్నప్పుడు చాలా మంది నాన్‌వెజ్ ఎక్కువగా తింటుంటారు. ఇది కూడా పొట్ట చుట్టూ కొవ్వు పెరిగేలా చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
స్మోకింగ్ :
స్మోకింగ్ (నేషనల్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ రిపోర్ట్) చేయడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ వస్తుందట. కానీ, చాలా మందికి ఈ విషయం తెలియదు. ధూమపానం చేయడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోయి, చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనివల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుందని నిపుణులు చెబుతున్నారు. 2011లో 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. స్మోకింగ్ చేయని వారికంటే స్మోకింగ్ చేసేవారికి బెల్లీ ఫ్యాట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో జపాన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లాంగేవిటీ సైన్సెస్‌కు చెందిన 'డాక్టర్ షిమోకటా హిరోషి' పాల్గొన్నారు.