Health Benefits of Raw Tomatoes :సాధారణంగా వివిధ వంటకాల్లో ఎక్కువగా ఎర్రటి టమాటలను వాడుతుంటారు. కానీ, పచ్చి టమాటలను తీసుకోవడం ద్వారా కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని మీకు తెలుసా? అవునండీ.. పచ్చిగా ఉండే టమాటల్లో కూడా ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇంతకీ, పచ్చి టమాటలు తింటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పోషకాల స్టోర్ హౌజ్ :పండిన టమాటల్లో(Tomatoes) మాత్రమే కాదు.. పచ్చి టమాటల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. పచ్చి టమాటల్లో విటమిన్ సి, ఎ, కె, ఐరన్, పోటాషియం, ఫోలేట్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, క్రోమియం, జింక్, కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయట. అందుకే వీటిని పోషకాల స్టోర్ హౌజ్‌గా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ఫలితంగా వీటిని తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది :పచ్చి టమాటల్లో పుష్కలంగా ఉండే విటమిన్ సి.. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అలాగే.. విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుందని.. వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా పచ్చిటమాటల్లో ఉండే విటమిన్ కె రక్తం గడ్డకట్టడానికి చాలా సహాయపడుతుందంటున్నారు.
క్యాన్సర్ నివారణ :పచ్చి టమాటల్లో లైకోపీన్ అనే ప్రత్యేక పదార్థం ఉంటుంది. ఎర్రని టమాటల్లో కంటే వీటిల్లో ఈ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. ఇది ప్రొస్టేట్, స్టమక్, స్కిన్.. వంటి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : గ్రీన్ టమాటల్లో పుష్కలంగా ఉండే విటమిన్లు, మినరల్స్.. ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని ప్రోత్సహిస్తాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. టమాట జ్యూస్‌ని స్కిన్‌కి అప్లై చేయడం వల్ల సన్‌బర్న్ నుంచి మంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు.
డయాబెటిస్ కంట్రోల్ : పచ్చి టమాటలు తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్ రోగులు మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు. ముఖ్యంగా వీటిలో ఉండే లైకోపిన్, ఫైబర్.. వంటి పోషకాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో, మంటను తగ్గించడంలో, కణజాల నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
2018లో 'Nutrition, Metabolism and Cardiovascular Diseases' అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు 12 వారాల పాటు రోజుకు రెండు పచ్చి టమాటాలు తిన్న తర్వాత వారి రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని 'సన్ యాట్-సెన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్'కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ Xin-wei Wu పాల్గొన్నారు. పచ్చి టమాటాలు తినడం వల్ల అందులోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.