Probiotics Health Benefits :వ్యాధుల మీద రెండు రకాలుగా పోరాడవచ్చు. ఒకటి వ్యాధులకు సరైన మందులు వాడటం ద్వారా లేదా చికిత్స చెయ్యడం ద్వారా. రెండోది వ్యాధులు రాకుండా ఆహారం ద్వారా సొంతంగా శరీరాన్ని రక్షించుకోవడం ద్వారా. అయితే వైద్యులు ఇప్పుడు వ్యాధులు రాకుండా సొంతంగా శరీరాన్ని సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకోసం ముఖ్యంగా ప్రోబయోటిక్స్ ఫుడ్స్‌ను మీ డైట్లో చేర్చుకోమని సలహా ఇస్తున్నారు. ఇంతకీ అసలు ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోబయోటిక్స్ అంటే ఏంటి?
What Is Probiotics : మన పొట్టలో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా నివసిస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణం చేయడం దగ్గర్నుంచి క్యాన్సర్లు, ఎలర్జీల బారిన పడకుండా రక్షణగా ఈ బ్యాక్టీరియా నిలుస్తోంది. అయితే ఇందులో 10శాతం చెడ్డ బ్యాక్టీరియా ఉండగా, మిగతా బ్యాక్టీరియా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కాగా మంచి బ్యాక్టీరియాను పెంచడానికి పులియబెట్టిన ఆహారాలను తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు డాక్టర్లు. ఇలా పులియబెట్టిన ఆహారాలను లేదా మంచి బ్యాక్టీరియాను పెంచే విధంగా సప్లిమెంట్లను వైద్యపరంగా 'ప్రోబయోటిక్స్' అని పిలుస్తారు.
ఇడ్లీ, దోశ పిండిలోనూ ప్రోబయోటిక్స్
మనం రోజూ తినే దోశ, ఇడ్లి లాంటి వాటి కోసం పిండిని పులియబెట్టడం వల్ల మన శరీరంలోకి మంచి బ్యాక్టీరియా చేరుతుంది. ఈ రకంగా పులియబెట్టిన పిండిలను ప్రోబయోటిక్స్‌గా చెప్పుకుంటాం. అలాగే పాలలో తోడు వేసి పులియబెట్టడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రెండు పద్ధతుల్లోనే కాకుండా మార్కెట్లో కృత్రిమంగా దొరికే సప్లిమెంట్ల ద్వారా ప్రోబయోటిక్స్‌ను పొందవచ్చు. ఈ మధ్య కాలంలో జీర్ణ సంబంధిత సమస్యలను డీల్ చెయ్యడానికి వైద్యులు చాలా వరకు పెరుగు లేదా మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్‌ను ఎక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.