Prediabetes Symptoms : ప్రస్తుత కాలంలో ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో ఒకటి.. మధుమేహం. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ చేయకపోవడం, జన్యువులు వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే.. రోజూ మందులు వేసుకుంటూ జాగ్రత్తలు పాటించడం తప్ప వేరే మార్గం లేదు.
ఇది ఇలా ఉంటే.. మెజార్టీ జనాలకు షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏంటో తెలియదు. దీనివల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగి గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, కంటి చూపు తగ్గిపోవడం వంటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అయితే, డయాబెటిస్ వచ్చే ముందు మన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో.. హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ 'డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి' వివరిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్రీ డయాబెటిస్ :కొద్దిపాటి లక్షణాలతో కనిపించే మధుమేహాన్ని 'ప్రీ డయాబెటిస్' అంటారు. దీనివల్ల గుండె రక్తనాళాల జబ్బు, మరణాల ముప్పు పెరుగుతుంది. ప్రీ డయాబెటిస్ ఉన్నవారిలో గ్లూకోజ్ మమూలు కన్నా ఎక్కువగానే ఉంటుంది కానీ, మధుమేహంగా నిర్ధారించే అవకాశం అంత ఎక్కువగా ఉండదని వైద్యులు చెబుతున్నారు.
తరచుగా మూత్రవిసర్జన చేయడం :తరచూ మూత్రవిసర్జన చేయడం డయాబెటిస్ ఉందనడానికి మొదటి సంకేతం. రాత్రి సమయంలో కూడా ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తే ప్రీ డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించాలంటున్నారు డాక్టర్ రవిశంకర్.
దాహం ఎక్కువగా వేయడం :తరచూ నీళ్లు తాగినా కూడా ఎక్కువగా దాహం వేస్తుంటే.. మధుమేహం వచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించాలి. షుగర్ వల్ల రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో దాహం ఎక్కువగా వేస్తుందని చెబుతున్నారు.
ఆకలి ఎక్కువగా వేయడం :ఆహారం సరిపడినంత తిన్న తర్వాత కూడా ఆకలి వేస్తుంటే అది ప్రీ డయాబెటిస్ సంకేతంగా గుర్తించాలి. శరీరానికి తగినంత గ్లూకోజ్ అందకపోవడంతో ఇలా ఆకలి ఎక్కువగా వేస్తుందంటున్నారు.