Potatoes and Heart Disease :కూరగాయల కోసం మార్కెట్‌కి వెళ్లినప్పుడు ఎక్కువ మంది మిగతా కూరగాయలతోపాటు.. పొటాటోలు తప్పకుండా తీసుకొస్తుంటారు. ఎందుకంటే ఇవి కొన్ని రోజుల వరకు పాడైపోకుండా తాజాగా ఉంటాయి కాబట్టి. ఇక మనలో చాలామందికి బంగాళదుంపతో చేసే కర్రీ, ఫ్రై అంటే ఎంతో ఇష్టం. వీటితో చేసే ఏ రెసిపీలైనా అన్నంలోకి, చపాతీల్లోకి సూపర్ టేస్టీగా ఉంటాయి.
అయితే, బంగాళదుంపలు తరచూ తినడం వల్ల హృదయ సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుందని కొంతమంది అనుకుంటుంటారు. ఈ కారణంతో కొంతమంది వాటికి దూరంగా కూడా ఉంటారు. అయితే, బంగాళదుంపలు తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
కాలంతో సంబంధం లేకుండా అన్ని రోజుల్లోనూ పొటాటోలు మార్కెట్లో లభిస్తాయి. పైగా మిగతా కూరగాయలతో పోలిస్తే ఇవి చౌకగానే దొరుకుతాయి. దీంతో ఎక్కువ మంది ప్రజలు వీటిని ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే, బంగాళదుంపలు తినడం వల్ల హృదయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని కొందరు భావిస్తుంటారు. దీనిపై అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు రీసెర్చ్ చేశారు. వీటిని తినడం.. రక్తపోటు, బ్లడ్‌లో గ్లూకోజ్ స్థాయులుపెరగడానికి దారితీయదని బోస్టన్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ లిన్ ఎల్. మూర్ (చోబానియన్ & అవెడిసియన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్) తెలిపారు. ఎవరైనా సరే సందేహాం లేకుండా ఆలుగడ్డలను తినచ్చని చెబుతున్నారు. ఈ పరిశోధన 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ సైన్స్'లో ప్రచురితమైంది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
పోషకాలు అనేకం..
పొటాటోలలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ముఖ్యంగా ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గిస్తాయి.