Health Benefits Of Poppy Seeds : చాలా మంది గసగసాలను మాంసాహార వంటలు చేసినప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. నాన్వెజ్ వంటలు మాత్రమే కాదు.. కొందరు ఏదైనా గ్రేవీ కర్రీ వండుకునేటప్పుడు గసగసాల పొడిని వేస్తుంటారు. అయితే, గసగసాలు(Khus Khus)అనేవి వంటలకు మంచి రుచిని ఇవ్వడమే కాదు.. వాటిని తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గసగసాల్లో ప్రొటీన్లు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా గసగసాల వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్లు, కాల్షియం, మాంగనీస్, జింక్ వంటి ఖనిజాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. చాలా తక్కువ వాటిల్లో దొరికే ఒమేగా-3, ఒమేగా-6 ఫాటీ ఆమ్లాలు గసగసాల్లో సమృద్ధిగా లభిస్తాయంటున్నారు. ఫలితంగా వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు.
అజీర్తి సమస్యలు దూరం :గసగసాల్లో అధికంగా ఉండే పీచు పదార్థం.. ఆహారం సులభంగా జీర్ణం అవడానికి తోడ్పడుతుంది. అలాగే పేగు ఆరోగ్యాన్ని మెరుగు పరచి మలబద్దకం, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుంచి మంచి ఉపశమనం కలిగస్తుందంటున్నారు నిపుణులు.
గుండె ఆరోగ్యానికి మేలు : గసగసాలతో తయారు చేసిన నూనెలో మోనో, పాలీ శాచురేటెడ్ కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే అన్ శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతాయంటున్నారు.
2020 "Nutrition, Metabolism, and Cardiovascular Diseases" అనే జర్నల్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. గసగసాల నూనె LDL (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, HDL (మంచి) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో పాకిస్థాన్లోని కరాచిలో ఉన్న డౌ మెడికల్ కళాశాలకు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ మోహమ్మద్ అస్గర్ పాల్గొన్నారు. గసగసాల్లో ఉండే అన్ శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
గసగసాలు ఆరోగ్యానికి మంచివేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?
నిద్రలేమి, నోటి అల్సర్లకు చెక్ :గసగసాలతో చేసిన టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు. గసగసాలను వేడి చేసిన నీటిలో వేసి టీ తయారు చేసుకోవచ్చు. ఈ టీ తాగితే చక్కగా నిద్రపడుతుంది. అలాగే ఇందులోని చల్లదనం లక్షణం వల్ల నోటి అల్సర్ల బాధ నుంచి కూడా ఉపశమనం లభిస్తుందంటున్నారు.