Best Fruits To Increase Platelets Count :వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక రకాల సీజనల్ వ్యాధులు ఇబ్బందిపెడుతుంటాయి. ముఖ్యంగా ఫ్లూ, డెంగీ, టైఫాయిడ్, న్యుమోనియా, మలేరియా, వాంతులు, విరేచనాలు, కామెర్ల వంటివెన్నో విజృంభిస్తుంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. డెంగీ. ఈ పేరు చెబితేనే హడలెత్తిపోతారు ప్రజలు. అందుకు ప్రధాన కారణం.. రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య పడిపోవడమే. కేవలం ఈ ఒక్క జ్వరం అనే కాదు.. మలేరియా వచ్చినా ఇతరత్రా ఇన్ఫెక్షన్లు సోకినా ఈ రక్తకణాల సంఖ్య ఒక్కసారిగా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారొచ్చు. అందుకే అలాంటి టైమ్‌లో తగిన మందులు వాడుతూ సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఆ టైమ్‌లో ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే నేచురల్‌గా ప్లేట్‌లెట్స్ సంఖ్యను పెంచుకోవచ్చంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బొప్పాయి : ఈ పండులో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, కేవలం పండులో మాత్రమే కాదు.. దీని ఆకుల్లోనూ బోలెడు ఆరోగ్యానికి సంబంధించిన గుణాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇందులో ఫ్లేవనాయిడ్స్, అల్కాలాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే.. బొప్పాయి(Papaya) పండుతో పాటు ఆకులను తీసుకున్న మంచి ఫలితాలు లభిస్తాయంటున్నారు. ప్రధానంగా డెంగీ జ్వరం వచ్చినప్పుడు రోజూ కొన్ని పచ్చి బొప్పాయి ముక్కలు తిన్నా లేదా ఖాళీకడుపున లేత బొప్పాయి ఆకుల రసం తాగినా ప్లేట్‌లెట్స్ కౌంట్‌లో గణనీయమైన మార్పు కనిపిస్తుందంటున్నారు నిపుణులు
2019లో "Frontiers in Pediatrics" అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. డెంగ్యూ జ్వరం వల్ల తక్కువ ప్లేట్‌లెట్‌ల సంఖ్య ఉన్న పిల్లలకు బొప్పాయి లేత ఆకుల రసం ఇవ్వడం వల్ల ప్లేట్‌లెట్‌ల సంఖ్య గణనీయంగా పెరిగిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ డేవిడ్ టాన్ పాల్గొన్నారు. బొప్పాయిలోని ఔషధ గుణాలు ప్లేట్‌లెట్స్ సంఖ్యను పెంచడంలో చాలా బాగా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
దానిమ్మ :ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పాటు ఐరన్, విటమిన్ సి మెండుగా ఉంటాయి. ఫలితంగా వీటిని తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గకుండా ఉంటుందంటున్నారు నిపుణులు. రోజూ ఓ గ్లాసు దానిమ్మ రసాన్ని కొన్ని వారాలపాటు క్రమం తప్పకుండా తాగితే రక్తకణాల సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు.
కివీ : దీనిలో ప్రొటీన్, కాల్షియం, పొటాషియంతోపాటు సి, కె, ఇ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రక్తహీనత, బి-విటమిన్ లోపంతోనూ వైరల్ ఇన్ఫెక్షన్లతోనూ బాధపడేవాళ్లు రోజుకి రెండు కివీ(Kiwi)పండ్లను తినడం వల్ల ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే డెంగీ జ్వరం వచ్చినప్పుడు ఈ పండు తినడం ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోకుండా కాపాడుకోవచ్చంటున్నారు.