Parents Follow These Tips to Stop the Kids Crying: చిన్నపిల్లలు ఏడవడం సహజం. పిల్లలు ఏడవడానికి కారణాలు కూడా చాలానే ఉంటాయి. వారు అడిగింది కొనివ్వకపోయినా, వారు అనుకున్నది జరగకపోయినా, తల్లిదండ్రులు, పెద్దలు, ఎవరైనా మందలించినా.. చీటికి మాటికి ఏడుస్తుంటారు. ఏడవద్దని చెప్పినా ఆ అలవాటు మాత్రం మానుకోరు. అయితే చిన్నపిల్లల్లో ఈ అలవాటు వారు పెరిగేకొద్దీ క్రమంగా తగ్గుతూ వస్తుంది. కానీ కొందరు పిల్లల విషయంలో మాత్రం ఇది ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గడం అనేది ఉండదు. కేవలం వారు అడిగింది ఇవ్వలేదనో, పేరెంట్స్ తిట్టారనో కాకుండా ప్రతి చిన్న విషయానికీ ఏడుస్తున్నా, చిన్న సమస్యలకు కూడా భయపడుతున్నా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఈ క్రమంలో పిల్లల ఏడుపు తగ్గించడానికి తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులు కొన్ని ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..
ఏడవడం గురించి వివరించాలి..:ప్రతిదానికి ఏడవడం అసలైన పరిష్కారం కాదు. అది పెద్దల విషయంలోనైనా.. లేకుంటే పిల్లల విషయంలోనైనా. కాబట్టి ఈ విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడటం, ఏడవటం వల్ల ఎలాంటి ఫలితం ఉండదనే విషయాన్ని ముఖ్యంగా తెలపాలి. అసలు వారు ఎందుకు ఏడుస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవాలి. పిల్లలు చెప్పే విషయాలను అర్థం చేసుకోవాలి. వారి డౌట్లకు సరైన సమాధానాలు ఇవ్వాలి. తద్వారా ఏడవడం మంచిది కాదని పిల్లలు అర్థం చేసుకుని.. పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు.
అలర్ట్ : మీ పిల్లలు ఆన్‌లైన్‌కు బానిసవుతున్నారా? - ఈ టిప్స్‌తో మీ దారిలోకి తెచ్చుకోండి!
సానుభూతి..:పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఊరడించడానికి బదులుగా తిట్టినా, కొట్టినా వారు ఇంకా ఎక్కువ ఏడుస్తారు. కాబట్టి ఆ వయసులో పిల్లలకు కావాల్సింది సానుభూతి. తిట్టడం, కొట్టడం కాకుండా ఓదార్చి, ధైర్యం చెబితే తొందరగా ఏడుపు మానతారు.
ఎదుర్కోవడం నేర్పాలి..:ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వగానే ఏడవడానికి పిల్లలను ప్రోత్సహించకూడదు. సమస్యలను ఎలా ఎదుర్కోవాలో వారికి నేర్పించాలి. పిల్లలకు ఈ విషయాలను నేర్పించడం ఒక కళ. కానీ తల్లిదండ్రులు ప్రయత్నిస్తే పిల్లలు ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం నేర్చుకుంటారు. సమస్య వచ్చినప్పుడు ఏడవడానికి బదులు పరిష్కారం దిశగా ఆలోచిస్తారు.