Obesity Impact on Kidney Health : ప్రస్తుత రోజుల్లో జీవన శైలి, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. అలాగే రోజూ బాడీకి సరైన శారీరక శ్రమ లేకపోవడం కారణంగా వయసుతో సంబంధం లేకుండా చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఎక్కువ మందికి ఊబకాయంతో మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, ఎముకలు గుల్లబారటం, కింద పడిపోవటం వంటి సమస్యలు ముంచుకొస్తాయన్నది తెలిసిన విషయమే. అదేవిధంగా ఊబకాయం వచ్చిన చాలా మంది మానసికంగా బాధపడుతుండటం మనం చూస్తుంటాం. అయితే ఊబకాయంతో కిడ్నీల ఆరోగ్యానికి కూడా పెద్ద ముప్పు పొంచి ఉందంటున్నారు నిపుణులు. తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో అధిక ప్రొటీన్లతో కూడిన ఆహారాన్ని, జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తింటూ ఊబకాయులుగా మారుతున్న వారి కిడ్నీలు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉందని తేలింది. అందుకు సంబంధించిన వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మధుమేహం ఉన్న వారికి కిడ్నీ సమస్యలు రావడం అత్యంత సహజం. అంతేకాదు ఊబకాయం ఉన్నవారికి మూత్రపిండాల సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని తాజా రీసెర్చ్‌లో వెల్లడైంది. ఈ పరిశోధనను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (HCU) అసోసియేట్ ప్రొఫెసర్ అనిల్‌కుమార్, జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) శాస్త్రవేత్త డాక్టర్ జి.భానుప్రకాశ్‌రెడ్డి సంయుక్తంగా చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఊబకాయుల సంఖ్య పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు రావడంతో, వారికి వచ్చే ఆరోగ్య సమస్యలపై రీసెర్చ్ చేయాలని నివేదికను సమర్పించగా, సైన్స్, ఇంజినీరింగ్ పరిశోధన బోర్డు అవసరమైన నిధులను సమకూర్చింది.
ఈ మేరకు HCU అసోసియేట్ ప్రొఫెసర్ అనిల్‌కుమార్, NIA శాస్త్రవేత్త డాక్టర్ జి.భానుప్రకాశ్‌రెడ్డి కలిసి చుంచు ఎలుకలు, పుట్టుకతోనే ఊబకాయంతో ఉన్న విస్టార్ ఎలుకలపై కొన్ని ప్రయోగాలు జరిపారు. ఈ క్రమంలోనే వాటికి జంక్‌ఫుడ్‌ను, కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినిపించడం చేశారు. ఫలితంగా కొన్ని నెలల తర్వాత ఎలుకలకు ఊబకాయం వచ్చింది. అప్పుడు వాటి యూరిన్ ద్వారా అధికంగా ప్రొటీన్యూరియా బయటకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ పరిణామాన్ని మూత్రపిండాలు దెబ్బతింటున్నాయనడానికి సూచనగా భావించారు.