Healthy Eating Habits to Avoid Obesity in Children:ఊబకాయం.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పెను ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. గతంలో 40, 50 ఏళ్ల వయసు వారికి ఊబకాయం వచ్చేది. కానీ ఇప్పుడు పదేళ్లలోపు పిల్లల్లోనూ ఈ సమస్య ఎక్కువైంది. దీనికి కారణం ఆహార నియంత్రణ లేకపోవడమే అంటున్నారు నిపుణులు. అందుకే ఆరోగ్యంగా తినడం అనేది పసివయసు నుంచే అలవాటు చేయాలని ఓ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరి ఆరోగ్యానికి హాని చేసే వ్యాధే.. ఈ ఊబకాయం. తీపి పదార్థాలు, జంక్‌ఫుడ్.. చిన్నారుల్లో స్థూలకాయానికి ముఖ్య కారణాలు. మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం, వేళకు తినకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల చిన్నారులు ఊబకాయం బారిన పడుతున్నారు. ఈ ఊబకాయం వల్ల టైప్ 2 మధుమేహం, కాలేయ వ్యాధి, పిత్తాశయ రాళ్లు, కీళ్ల రుగ్మతలు, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్లు, మానసిక రుగ్మతలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటన్నింటిని నుంచి బయటపడటానికి పసివయసు నుంచే నిర్ణీత వేళల్లో పోషకాహారాన్ని ఇవ్వాలని చెబుతున్నారు.
ఆరోగ్యంగా తినడం అనేది పసివయసు నుంచే అలవాటు చేయాలని.. అప్పుడే వాళ్లలో శారీరక, మానసిక ఎదుగుదలతోపాటు సామాజికంగానూ బాగుంటారని ఇలినాయ్ విశ్వవిద్యాలయం చేసిన తాజా పరిశోధన చెబుతోంది. చిన్నతనంలోనే టైమ్ ప్రకారం ఆహారం తీసుకోవడం అలవాటైతే.. భవిష్యత్తులో వాళ్లకి అన్ని విషయాల్లోనూ స్వీయ నియంత్రణ అలవాటవుతుందని అంటున్నారు. అయితే పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా లోపించడం, పోషకాహార లోపం, వాతావరణ పరిస్థితులు.. వంటివన్నీ వాళ్లకి ఆహారం మీద నియంత్రణ లేకపోవడానికి దారితీస్తున్నాయట. అందుకే పసివయసు నుంచే నిర్ణీత వేళల్లో పోషకాహారాన్ని ఇస్తే ఎలాంటి సమస్యలూ ఉండవని చెబుతున్నారు పరిశోధకులు. ఇదే విషయాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం కూడా స్పష్టం చేసింది(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). అందుకోసం తీసుకోవాలని ఆహారాలు..
పెరుగు: పిల్లల ఎదుగుదలలో పెరుగు మంచి పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్స్, కాల్షియం, ప్రోబయోటిక్స్, ప్రొటీన్స్ అధికంగా ఉంటాయి. జీర్ణక్రియ మెరుగుపరచడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని.. ఎముకలను, దంతాలను బలంగా చేస్తుందని అంటున్నారు. పిల్లలకు అన్నంలో కలిపి అయినా పెరుగు తినిపించవచ్చు. లేదా మజ్జిగ రూపంలో అయినా మంచిదే అంటున్నారు. ఇంట్లో చేసిన పెరుగు వల్ల మంచి ఫలితాలుంటాయంటున్నారు.
పప్పు- అన్నం: పప్పులో ఎన్నో పోషకాలుంటాయి. పప్పు, బియ్యంతో కలిపి వండితే చాలా రుచిగా ఉంటుంది. దీంతో పిల్లలు తినడానికి ఇష్టపడతారు. పిల్లలకు మంచి పోషకాలు అందించే సమతుల్యమైన ఆహారమిది! ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ పిల్లలను ఆనందంగా ఉండేందుకు దోహదపడతాయంటున్నారు.