How To Do Sri Hanumath Vratham In Telugu : పూజలు, వ్రతాలు హిందూ సంప్రదాయంలో భాగం. విశేషించి సంవత్సరంలో కొన్ని మాసాలలో చేసే పూజలు వ్రతాలు సత్ఫలితాలను ఇస్తాయని శాస్త్రవచనం. శ్రీకృష్ణ పరమాత్మ మార్గశిర మాసమంటే స్వయంగా తానే అని వివరించారు. ఈ మాసంలో ప్రతి తిథి పుణ్య తిథినే! ఈ సందర్భంగా ఈ మాసంలో ఆచరించే మరో ముఖ్యమైన వ్రతం గురించి తెలుసుకుందాం.
హనుమద్వ్రతం విశిష్టత
మృగశిరా నక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది. అలాంటి మృగశిర నక్షత్రం పౌర్ణమి రోజు ఉండే మార్గశిర మాసంలో హనుమంతుని ఆరాధనకు విశిష్టమైనది. మార్గశిర త్రయోదశి నాడు వచ్చే హనుమద్వ్రతం రోజు హనుమంతుని యథాశక్తి పూజిస్తే భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం సులభంగా పొందవచ్చు. ఈ సందర్భంగా హనుమద్వ్రతం ఎప్పుడు? ఆ పూజ ఎలా చేసుకోవాలి, ఇంతకు ముందు ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు తదిర విషయాలను తెలుసుకుందాం.
హనుమద్వ్రతం ఎప్పుడు
మార్గశిర శుద్ధ త్రయోదశి, డిసెంబర్ 13 వ తేదీ శుక్రవారం హనుమద్వ్రతం జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు పూజకు శుభ సమయం.
హనుమద్వ్రతం ఎలా ఆచరించాలి
మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు బ్రహ్మ ముహూర్తాన్నే నిద్రలేచి శుచియై నిత్య పూజాదికాలు యథావిధిగా పూర్తి చేసుకోవాలి. హనుమంతుడు పంపా నదీ తీరాన విహరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ వ్రతం పంపా నదీ తీరాన చేయడం ఉత్తమం. అందరికీ అది సాధ్యపడదు కాబట్టి పంపా నదికి బదులుగా పంపా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా కలశ పూజ చేసి తరువాత హనుమద్వ్రతాన్ని ఆచరిస్తే హనుమ పంపా నదీ తీరాన్నే తనను పూజించినట్లుగా భావించి అనుగ్రహిస్తాడు.
పూజా విధానం
ముందుగా గణపతి పూజ పూర్తి చేసి హనుమంతుని, ఆయన శక్తి స్వరూపమైన సువర్చలాదేవిని, పంపా నదిని కలశంలోకి ఆవాహన చేసి పూజించాలి. 13 పోగుల నూలు దారానికి పసుపు పూసి 13 ముళ్లు వేసి తోరాన్ని తయారు చేసుకోవాలి. గంధం, సింధూరం, పసుపు ఎరుపు రంగులో ఉండే పుష్పాలు, తమలపాకులతో ఆంజనేయుని షోడశోపచారాలతో పూజించాలి. గోధుమ నూక, బెల్లంతో తయారు చేసిన పాయసం, అప్పాలు స్వామికి నివేదించాలి. పిదప ఒక బ్రహ్మచారిని గంధం, అక్షింతలతో పూజించి పదమూడు అప్పాలు వాయనం ఇవ్వాలి. బ్రహ్మచారికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించుకోవాలి. ఈ రోజున అన్నదానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ విధంగా 13 సంవత్సరాలు ఆటంకం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించి తరువాత ఉద్యాపన చేసుకోవాలి. ఈ వ్రతాన్ని కుల మత జాతి లింగ భేదం లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు.
పూజ పూర్తయ్యాక వ్రత కథను చదువుకుని శిరస్సున అక్షింతలు వేసుకుంటే వ్రతం సంపూర్ణ అయినట్లుగా భావించాలి.
ఓం శ్రీ హనుమతే నమః జైశ్రీరామ్!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.