Night Shifts Side Effects: ఒకప్పటి కాలంలో ఉద్యోగాలు అంటే పగలు మాత్రమే ఉండేవి. కానీ నేటి జనరేషన్లో పలు కార్పొరేట్ సంస్థలు 24/7 వర్క్ నడిచేలా చేస్తున్నాయి. అయితే.. మార్నింగ్ షిఫ్ట్‌లు సహా ఇతర షిఫ్ట్‌లు ఎలా ఉన్నా నైట్ షిఫ్ట్ వల్ల మాత్రం అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఆరోగ్యానికి సంబంధించి పలు సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా మధుమేహం ఎటాక్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
మన శరీరంలోని అంతర్గత వ్యవస్థను జీవ గడియారం అంటారు. ఇది 24 గంటలు శరీర విధులను నియంత్రిస్తుంది. దీనినే సిర్కాడియన్ రిథమ్ అని కూడా పిలుస్తారు. ఈ గడియారం మన నిద్ర, ఆకలి, జీర్ణక్రియ, హార్మోన్ స్థాయిలు, శరీర ఉష్ణోగ్రత వంటి అనేక ముఖ్యమైన విధులను నియంత్రిస్తుంది. మనం ఈ జీవ గడియారాన్ని సరిగ్గా పాటించనప్పుడు అవి శరీరంలో వివిధ మార్పులకు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మధుమేహం రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందని అంటున్నారు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయని చెబుతున్నారు.
2018లో జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రాత్రిపూట పనిచేసే వ్యక్తులకు మధుమేహం వచ్చే ప్రమాదం 12% ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇటలీలోని నేపిల్స్ యూనివర్శిటీ ఫెడెరికో II లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సెస్కో పి. క్యాప్పుసియో(Francesco P. Cappuccio) పాల్గొన్నారు. రాత్రిపూట పనిచేసే వ్యక్తులు టైప్ 2 మధుమేహం బారిన పడే ప్రమాదం ఎక్కువని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా.. 2019లో Washington State University నిర్వహించిన ఒక అధ్యయనంలో రాత్రి పూట పనిచేసే వ్యక్తులలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉండటం, ఇన్సులిన్ సున్నితత్వం తగ్గడం, కొన్ని ప్రోటీన్ల స్థాయిలు మారడం గమనించారు. ఈ మార్పులు టైప్ 2 మధుమేహం, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే నైట్ షిఫ్ట్ వల్ల కేవలం డయాబెటిస్ మాత్రమే కాకుండా పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. అవేంటంటే..
జీర్ణ సమస్యలు:రాత్రిపూట పనిచేయడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా ప్రభావితమవుతుందని నిపుణులు అంటున్నారు. అజీర్ణం, గ్యాస్ట్రోఎసోఫేగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD), అల్సర్లు వంటి సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు.