Best Tips To Prevent Greasy Hair : తలపైన ఉండే సెబాషియస్ గ్రంథుల నుంచి 'సెబమ్' అనే నూనె లాంటి పదార్థం ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల జుట్టు జిడ్డుగా మారుతుందంటున్నారు సౌందర్య నిపుణులు. దుమ్ము, ధూళి, చెమట వంటివి తోడైతే.. జుట్టు ఇంకా జిడ్డుగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఫలితంగా దురద, తలపై చర్మమంతా పొట్టులా రాలడం, చుండ్రు వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. దీని వల్ల కొందరిలో నుదటిపై యాక్నే కూడా వస్తుందంటున్నారు. దీనికి తోడు.. కాలుష్యం, రసాయనాలున్న షాంపూలు, ఉత్పత్తులు వాడటం వల్లా మాడు పొడిబారి, అలర్జీలతోపాటు జుట్టు విపరీతంగా రాలుతుందంటున్నారు. మీరూ ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నట్లయితే.. ఈ నేచురల్ రెమిడీస్తో ఈజీగా జిడ్డు వదిలించుకోవచ్చంటున్నారు డాక్టర్ శైలజ సూరపనేని. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
- జిడ్డు సమస్యను తగ్గించడంలో కలబంద చాలా బాగా సహాయపడుతుందంటున్నారు డాక్టర్ శైలజ. ఇందుకోసం కొద్దిగా కలబంద గుజ్జు తీసుకొని తలకు పట్టించాలి. అలా కాసేపు ఉంచి ఆపై తలస్నానం చేస్తే సరిపోతుందట.
- 2015లో 'జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. కలబంద గుజ్జును 8 వారాల పాటు తలకు రాయడం వల్ల జిడ్డు గల చర్మం ఉన్న వ్యక్తులలో సెబమ్ ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్లు కనుగొన్నారు.
- మీ జుట్టు జిడ్డుగా మారుతుంటే.. కొబ్బరినూనెలో కొన్ని చుక్కలు టీట్రీ ఆయిల్ లేదా నిమ్మరసం కలిపి రాసినా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
- తలస్నానం చేశాక.. మగ్గు నీటిలో చెంచా యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి తలకు అప్లై చేయండి. ఆపై కొన్ని నిమిషాలు ఆగి నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. ఇది మాడుపై రిలీజ్ అయ్యే అదనపు సెబమ్ స్రావాన్ని నియంత్రించి.. జుట్టు జిడ్డుదనాన్ని తగ్గిస్తుందంటున్నారు.
- లేదంటే.. కళ్లుప్పుకి నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కలిపి, తడి తలకు మర్దనా చేసుకున్నా మంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా నిమ్మలో సిట్రిక్ యాసిడ్ సెబమ్ ఉత్పత్తిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు.
ఇంట్రస్టింగ్ : ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు - జుట్టు రెండింతలు వేగంగా పెరుగుతుంది!
- బేకింగ్ సోడాని తడి తలకు పట్టించి, బాగా రుద్ది, షాంపూతో తలస్నానం చేసినా జిడ్డు జుట్టు సమస్యను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
- వేపాకుని నీటిలో మరిగించి, ఆ నీటితో తలస్నానం చేసినా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు సౌందర్య నిపుణులు శైలజ. పైన చెప్పిన చిట్కాలలో మీకు నచ్చినదాన్ని వారానికి రెండుసార్లు ప్రయత్నిస్తే.. ఇన్‌ఫ్లమేషన్, జిడ్డు జుట్టు, చుండ్రు, దురద సమస్యలు పోయి.. హెయిర్ షైనీగా మారుతుందంటున్నారు.
- ఇవి ఫాలో అవ్వడమే కాకుండా.. వాటర్ బేస్డ్ షాంపూలనే యూజ్ చేయాలని సూచిస్తున్నారు. అలాగే.. షాంపూ చేశాక ఎక్కువ నీటితో జుట్టు కడుక్కోవాలి. కండిషనర్ వాడుతూనే హెయిర్ డ్రైయ్యర్, ఐరనింగ్ వంటి వాటికి దూరంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు.
- అలాగే.. దువ్వెన తరచూ శుభ్రం చేసుకోవాలి. ఎండలోకి వెళ్లొచ్చినా, వ్యాయామం చేసినా చెమట బాగా పడితే తప్పనిసరిగా తలస్నానం చేసేలా చూసుకోవాలి. ఇంకా జుట్టు ఆరాకే జడ వేసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా జిడ్డు జుట్టు సమస్య చాలా వరకు తగ్గుతుందని సూచిస్తున్నారు డాక్టర్ శైలజ.