Natural Remedies to Cure Mouth Ulcers :మనం రోజూ తీసుకునే ఆహారంలో పోషకాలు తక్కువైతే వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాంటి వాటిలో నోటిపూత లాంటివి కూడా ఓ సమస్యే అంటున్నారు వైద్య నిపుణులు. అధిక ఒత్తిడికి గురవడం, శరీరంలో వేడి ఎక్కువవడం, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు కూడా ఇందుకు కారణాలంటున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి నిపుణులు కొన్ని సహజసిద్ధ మార్గాలను సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా నోటిపూత సమస్యను పరిష్కరించుకోవచ్చని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అసలెందుకీ నోటిపూత సమస్య :నోటిపూత రావడానికి వివిధ రకాల కారణాలున్నాయంటున్నారు నిపుణులు. అధిక ఒత్తిడి కూడా నోటిపూతకు కారణం అయ్యే అవకాశం ఉందంటున్నారు. అప్పుడప్పుడూ మనం తీసుకునే ఆహారం శరీరానికి పడకపోవడం కూడా కారణం కావచ్చు అంటున్నారు. నిమ్మ, నారింజ, యాపిల్, టొమాటో, స్ట్రాబెర్రీ.. లాంటి నిమ్మజాతి, ఆమ్ల గుణాలు కలిగిన పండ్లు, కూరగాయలు మోతాదుకు మించి తినడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా నోటిపూత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు. జింక్, ఫోలికామ్లం, బి12, సి విటమిన్లు, ఐరన్.. మొదలైనవి లోపించడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు. పదే పదే నొప్పి నివారణ మందులు వాడడం వల్ల ఒక్కో దశలో అవి శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో కూడా నోటిపూత రావచ్చని చెబుతున్నారు. నోరు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఎదురుకావచ్చంటున్నారు.
తేనెతో ఉపశమనం : అప్పుడప్పుడూ నోట్లో కణజాలాలు చిట్లిపోవడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుందంటున్నారు వైద్యనిపుణులు. అందుకనీ అక్కడ తిరిగి కణజాలం ఏర్పడడంలో తేనె సహాయపడుతుందంటున్నారు. అలాగే తేనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుందని, ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాల వల్ల నోటిపూత నుంచి సత్వర ఉపశమనం లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఎలా ఉపయోగించాలి? : దీనికోసం తేనెలో కొంచెం పసుపు వేసి పేస్ట్ లాగా తయీరప చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను సమస్య ఉన్న భాగంలో రాయాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు వైద్యులు. తేనె, పసుపు మిశ్రమానికి బదులుగా కేవలం తేనెను కూడా ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు.
కొబ్బరితో : కొబ్బరినీళ్లు, ఎండు లేదా పచ్చి కొబ్బరి, కొబ్బరి నూనె మెుదలగు వాటితో కూడా నోటిపూత దూరమవుతాయంటున్నారు వైద్య నిపుణులు. కొబ్బరినీ ళ్ల వల్ల శరీరంలోని వేడి తగ్గి, ఫలితంగా సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు. కొబ్బరి నూనెను సమస్య ఉన్న చోట రాయడం, ఎండు లేదా పచ్చి కొబ్బరి నమలడం, లాంటివి చేస్తే సమస్య త్వరగా తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.