తెలంగాణ

telangana

ETV Bharat / health

రీసెర్చ్ : బెంబేలెత్తిస్తున్న డెంగీ, మలేరియా - ఈ కలర్ డ్రెస్సు వేసుకున్న వాళ్లను దోమలు ఎక్కువగా కుడతాయ్! - Mosquitos Attract Black Colour Why - MOSQUITOS ATTRACT BLACK COLOUR WHY

Mosquito: దోమలు పలానా రకం బ్లడ్ గ్రూప్​ ఉన్నవాళ్లను ఎక్కువగా కుడతాయని అనడం చాలా మంది వినే ఉంటారు. కానీ.. పలానా రంగు ​డ్రెస్​ వేసుకున్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయని మీరు ఎప్పుడైనా విన్నారా? విచిత్రంగా అనిపించినా.. ఇది నిజమేనని చెబుతున్నారు పరిశోధకులు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Mosquito
Mosquito (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 2:23 PM IST

Mosquitos Attract Black Colour Why:కాస్తగట్టిగాగాలొస్తేనే కొట్టుకుపోయే దోమలు.. తేడావస్తే మనుషుల ప్రాణాలనే గాల్లో కలిపేస్తాయి. ఇక వర్షాకాలంలో వీటితో ప్రమాదం మరింతగా పెరుగుతుంది. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా అంటూ.. ఏకంగా ప్రాణాలతోనే చెలగాటం ఆడుతాయి. అయితే.. ఈ దోమలు ఎవరిని కుడతాయి అన్నప్పుడు నిపుణులు పలు రకాల సమాధానాలు చెబుతారు. కానీ.. చాలా మందికి తెలియని విషయం ఏమంటే.. మనుషులు వేసుకున్న దుస్తులను, వాటి రంగును బట్టి కూడా కుడతాయట. నమ్మలేకున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

మనిషిని కుట్టేవి కేవలం ఆడ దోమలే. దీనికి కారణం ఆడ దోమల సంతానోత్పత్తికి అవసరమయ్యే ప్రొటీన్లు మనిషి రక్తంలో ఉంటాయి. అంతేకాకుండా మనిషి శరీరం నుంచి వచ్చే వాసన, కార్బన్‌డైయాక్సైడ్‌, శరీర ఉష్ణోగ్రత, ద్వారా కూడా దోమలు ఎక్కువగా కుట్టడం అనేది ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అలాగే.. బ్లడ్ గ్రూప్‌ ఆధారంగా కూడా దోమలు కుడతాయని పలు అధ్యయనాల్లో సైతం వెల్లడైంది. A గ్రూప్‌ బ్లడ్‌ ఉన్న వారిని దోమలు తక్కువగా కుడతాయని, O బ్లడ్ గ్రూప్‌ వారిని ఎక్కువగా కుడతాయని పరిశోధనల్లో తేలింది. అంతేకాదు.. బీర్‌ ఎక్కువగా తీసుకునే వారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయని ఓ అధ్యయనంలో కనుగొన్నారు. మరో రీసెర్చ్ ప్రకారం.. నలుపు రంగు దుస్తులు ధరించే వారిని దోమలు ఎక్కువగా కుడతాయని అంటున్నారు నిపుణులు.

కారణం ఇదే: ఎందుకంటే.. దోమలకు స్పష్టమైన చూపు లేదని.. కొన్ని ప్రత్యేక రంగులను మాత్రమే అవి గుర్తించగలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ముదురు రంగు దుస్తులు లేదా నలుపు రంగు దుస్తులకు దోమలు తొందరగా ఎట్రాక్ట్​ అవుతాయని అంటున్నారు. కారణం అవి వేడిని త్వరగా గ్రహిస్తాయి. ఆ వేడిని తమలో నిలుపుకుంటాయి. వేడి వాతావరణం అంటే దోమలకు ఇష్టం. అందుకే దోమలు ముదురు రంగు లేదా నలుపు రంగు దుస్తులు ధరించిన వారిని కుట్టడానికి ఇష్టపడతాయి. కాబట్టి దోమలు ఎక్కువగా కుట్టకుండా ఉండాలంటే బ్లాక్​ కలర్​ డ్రెస్​లకు దూరంగా ఉండి.. లేత రంగు దుస్తులు ధరించడం మంచిదని సూచిస్తున్నారు.

2005లో "జర్నల్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్ బయాలజీ"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. నలుపు రంగు దుస్తులు ధరించిన వ్యక్తులను దోమలు ఎక్కువగా కుడతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యునైటెడ్ కింగ్‌డమ్​లోని యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో జంతు శాస్త్రంలో ప్రొఫెసర్ డాక్టర్​ ఫ్రెడెరిక్ డి. లాన్జె పాల్గొన్నారు.

దోమలు మిమ్మల్ని మాత్రమే కుడుతున్నాయా? అందుకు కారణాలు, తప్పించుకునే చిట్కాలు ఇవిగో!

శరీర ఉష్ణోగ్రత ఆధారంగా: కేవలం మనుషులు ధరించే దుస్తుల ఆధారంగా మాత్రమే కాకుండా.. మనిషి శరీర ఉష్ణోగ్రత ఆధారంగానూ దోమలు కుట్టాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంటాయని నిపుణులు అంటున్నారు. దోమలు వేడికి ఆకర్షితం అవుతాయని, అందుకే శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్నవాళ్లను ఎక్కువగా కుడుతుంటాయని తెలిపారు.

ఆ వాసనలు: అలాగే చెమట వాసన, చర్మం వాసన కూడా దోమలను మనుషుల వైపు ఆకర్షిస్తుంటాయి. ఈ వాసనల ఆధారంగా ఎక్కడ కుట్టాలనేది దోమలు నిర్ణయించుకుంటాయట. మనిషి శరీరం నుంచి చెమట ఎక్కువగా విడుదలయితే చర్మంపై ఉండే బ్యాక్టీరియా యాక్టివేట్ అవుతుంది. అది కార్బాక్సిలిక్ యాసిడ్‌ను విడుదల చేస్తుంది. ఈ యాసిడ్‌ వల్ల దోమలు శరీరం వైపు ఆకర్షితం అవుతుంటాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. చెమటలు బాగా పట్టేవారు రోజులో కనీసం రెండుసార్లు స్నానం చేస్తే దోమల బెడద నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

దోమలతో నిద్రలేని రాత్రులా? - ఈ 4 మొక్కలు పెంచితే చాలు - అన్నీ ఔట్!

దోమలకు కొందరే ఎందుకు ఇష్టం?.. వారినే ఎందుకు టార్గెట్ చేస్తాయి?

ABOUT THE AUTHOR

...view details