Health Benefits Of Moringa Oil :మునక్కాయలతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు, వాటి గింజల ద్వారా వచ్చే నూనెలో సైతం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. వీటి గింజలను ఎండబెట్టి, అనంతరం వాటి నుంచి తీసిన మునగ నూనె ఉపయోగించడం ద్వారా అటు ఆరోగ్య, సౌందర్యపరంగా కూడా ప్రయోజనాలు పొందచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మునగ నూనె చర్మంపై రాసుకోవడం వలన తేమ అందడంతో పాటు కాలుష్యం కోరల్లో చిక్కుకొని పాడైన చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చంటున్నారు నిపుణులు. అలాగే ఈ మునగ నూనె రోజువారీ పనుల వల్ల కలిగే అలసట, ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుందంటున్నారు. ఫలితంగా చర్మం మృదువుగా మారడమే కాకుండా ప్రకాశవంతంగా కూడా కనిపిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
పొడి చర్మానికి తేమ
పొడిచర్మతత్వం ఉన్నవారికి మునగ నూనె ఎంతగానో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది నేరుగా చర్మం లోపలి పొరల్లోకి ఇంకి పొడిబారిపోవడం, పొలుసుల్లా రాలిపోవడం లాంటి సమస్యలను దూరం చేస్తుందని చెబుతున్నారు. అలాగని జిడ్డుగా కూడా అనిపించదు. అలాగే పగిలిన పెదవులకు కూడా దీన్ని అప్త్లె చేసుకుంటే అవి తిరిగి మృదువుగా మారతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్స్, మినరల్స్ చర్మానికి తగినంత తేమతో పాటు పోషణ కూడా అందిస్తాయంటున్నారు నిపుణులు.
వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా
మునగ నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. తద్వారా చర్మం నవయవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయంటున్నారు నిపుణులు. అలాగే ఇందులోని విటమిన్ 'సి' కొలాజెన్ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేసి చర్మం ముడతలు పడకుండా సంరక్షిస్తుందంటున్నారు. కాబట్టి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు, ఒకవేళ ముఖంపై సన్నటి గీతలుంటే అది కూడా తగ్గుముఖం పట్టి తాజాగా, అందంగా కనిపించే చర్మం సొంతమవుతుందంటున్నారు. స్నానం చేసిన తర్వాత ఈ నూనెతో చర్మానికి మృదువుగా మర్దన చేసుకోవడం వల్ల రోజంతా తేమ నిలిచి ఉండేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పగటి పూట ఇబ్బంది అనుకునేవారు రాత్రి పూట నిద్రపోయే ముందు కూడా ఈ నూనెను చర్మానికి రాసుకోవచ్చని సూచిస్తున్నారు.
మచ్చలు తగ్గడానికి
మునగ నూనెలో విటమిన్ 'సి', 'ఇ' పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మంపై ఉండే మచ్చలు పూర్తిగా తొలగిపోయేందుకు దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. అందుకే చర్మంపై ఉండే నల్లమచ్చలు, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలకు చక్కని పరిష్కారంగా మునగ నూనె ఉపయోగించవచ్చంటున్నారు. అలాగే ఈ నూనెలో ఉండేటువంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ గుణాల ద్వారా చర్మంపై కాలిన మచ్చలు, గాయాల వంటివి తొందరగా నయమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.