Lung Cancer Detection Using Urine Test:క్యాన్సర్ అనగానే ప్రాణాంతకమైన వ్యాధని.. దీని నిర్ధరణ కోసం అనేక పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆందోళన పడుతుంటారు. కానీ, మామూలు మూత్ర పరీక్షతోనే ఊపిరితిత్తి క్యాన్సర్‌ను గుర్తించగలిగితే ఎలా ఉంటుంది? ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఊపిరితిత్తి క్యాన్సర్ తొలి లక్షణాలను సూచించే మూత్ర పరీక్షను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రొఫెసర్ Ljiljana Fruk నేతృత్వంలోని పరిశోధకుల బృందం దీనిని కనిపెట్టింది. చాలా ఊపిరితిత్తి క్యాన్సర్ కేసులు చివరిదశలోనే బయట పడడం వల్ల చికిత్స చేయటం కష్టంగా మారుతుంది. అదే తొలిదశలోనే క్యాన్సర్‌ను గుర్తించగలిగితే వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించటానికి వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వినూత్న మూత్ర పరీక్ష క్యాన్సర్‌ను గుర్తించడంతో కొత్త ఆశలు రేకెత్తిత్తున్నాయి. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇది జడ కణాల ప్రొటీన్లను గుర్తించటం ద్వారా ఊపిరితిత్తి క్యాన్సర్ తొలిదశలో ఉందనే విషయాన్ని చెబుతుందని పరిశోధకులు అంటున్నారు. దీనిని ఇప్పటికే ఎలుకలపై పరీక్షించగా విజయవంతమైందని వివరిస్తున్నారు. ఫలితంగా త్వరలోనే మనుషుల మీద కూడా పరీక్షించటానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మన శరీరంలో కొన్ని కణాలు వార్ధక్య స్థితికి చేరుకుంటాయని.. ఇవి విభజన, వృద్ధి చెందే సామర్థ్యాన్ని కోల్పోతాయని పేర్కొన్నారు. అలాగని ఇవి మరణించవని.. అందుకే వీటిని జడ కణాలనీ పిలుస్తారని చెబుతున్నారు. క్రమంగా ఇవి అన్ని భాగాల్లోని కణజాలాల్లో పెద్దఎత్తున పోగై.. చుట్టుపక్కల వాతావరణాన్ని మార్చటం ద్వారా కణజాలాన్ని దెబ్బతీస్తాయన్నారు. ఫలితంగా క్యాన్సర్ కణాలు పుట్టుకొచ్చేలా ప్రేరేపిస్తాయని వివరిస్తున్నారు. అందుకోసమే వీటి నుంచి పుట్టుకొచ్చే ప్రొటీన్లను గుర్తించటంపైన శాస్త్రవేత్తలు దృష్టి సారించారు.
ఈ నేపథ్యంలోనే సూది మందు ద్వారా లోపలికి పంపించే సెన్సర్‌ను రూపొందించారు పరిశోధకులు. ఇది జడ కణాల ప్రొటీన్లతో చర్య జరిపి, మూత్రంలో తేలికగా గుర్తించగల రసాయన మిశ్రమాన్ని విడుదల చేస్తుందని వివరిస్తున్నారు. దీని ఆధారంగా జడ కణాల ప్రొటీన్ల ఉనికిని గుర్తించటం సాధ్యమవుతుంని చెబుతున్నారు. ఈ సెన్సర్‌లో రెండు భాగాలుంటాయని.. జడ కణాల ప్రొటీన్ల సమక్షంలో ఇది విడిపోతుందని తెలిపారు. చిన్న భాగం కిడ్నీల నుంచి మూత్రం ద్వారా బయటకు వస్తుందని.. ఇదే ఊపిరితిత్తి క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించటానికి దోహదం చేస్తుందని అంటున్నారు. ఫలితంగా శరీరంలోంచి నమూనాలు తీసి పరీక్షించే అవసరం తప్పుతుందని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. ఇంకా ఇతర రకాల క్యాన్సర్లను పట్టుకోవటానికి కూడా ఇది సాయం చేస్తుందని వివరిస్తున్నారు.