Jowar Roti Benefits for Diabetes:ఈ మధ్య కాలంలో ప్రజలంతా ఒకప్పటి ఆహార అలవాట్లనే పాటిస్తున్నారు. చిరుధాన్యాలు, గోధుమలు, జొన్నలను తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ఇలా రోజు జొన్నలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు. ఇంకా కేవలం షుగర్ నియంత్రణ కాకుండా ఇతర ప్రయోజనాలున్నాయని.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా జొన్న రొట్టెలు మధుమేహులకు మంచి ఆహారమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలోనే ఉండి డయాబెటిస్ దరిచేరదని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఇన్సులిన్, ట్యాబ్లెట్లు తీసుకునేవారిలో వచ్చే సమస్యలను తగ్గిస్తుందని అంటున్నారు. జొన్నలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడంతో తొందరగా ఆకలి వేయదని అంటున్నారు. కొంచెం తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుందని చెబుతున్నారు.
"ఫైబర్‌లోని కార్బోహైడ్రేట్లు.. గ్లూకోజ్ రూపంలో నెమ్మదిగా రక్తంలోకి చేరతాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు జొన్నలు తీసుకోవడం మంచిది. ఇందులో ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇంకా కేవలం డయాబెటిస్ ఉన్నవారికే మాత్రమే కాకుండా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారికి జొన్నలు మంచి ఆహారం. అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అనవసరమైన కేలరీలను నియంత్రిస్తుంది. ఇంకా వివిధ రకాల విటమిన్ లోపాలను తగ్గించి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది."
--డాక్టర్ లహరి సూరపనేని, పోషకాహార నిపుణులు
జొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మలినాలను, కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. హృదయ సంబంధిత సమస్యలు రాకుండా సాయం చేస్తాయని వివరిస్తున్నారు. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని.. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయని అంటున్నారు. ఇంకా వీటిని రోజూ తినడం వల్ల చురుగ్గా ఉంటారని వెల్లడిస్తున్నారు. జొన్నలో జీర్ణ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేయడానికి దోహదపడే గుణాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఫలితంగా మలబద్ధకాన్ని తగ్గించి.. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుందని వివరిస్తున్నారు.
ఇంకా ఇందులో పొటాషియం, విటమిన్ బి తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఫలితంగా రక్తహీనతను తగ్గించి.. హిమోగ్లోబిన్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరిస్తున్నారు. మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఎముకలను దృఢంగా మారుస్తాయని చెబుతున్నారు. దీంతో ఎముకల సంబంధిత వ్యాధులు, సమస్యలను తగ్గిస్తాయని పేర్కొన్నారు. అయితే, ఆరోగ్యకరమైనవని జొన్నలను నూనెలో వేయించి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ పిల్లలు బరువు తక్కువగా ఉన్నారా? ఇలా చేస్తే పక్కా హెల్దీగా మారతారట!
తిన్న వెంటనే ఆకలి వేస్తుందా? ఇలా ఎందుకు అవుతుందో తెలుసా?