Jackfruit Seeds Benefits in Telugu:తియ్యటి రుచీ, సువాసనలతో మెప్పించే పనసపండుని ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. అందుకే చాలా మంది ఈ పండును ఇష్టంగా తింటారు. బాగా పండిన పనస తొనల రుచిని మాటల్లో వర్ణించలేం. అయితే చాలా మంది పనస తొనలు తిని అందులో విత్తనాలు పడేస్తుంటారు. మరికొందరు వీటిని ఉడికించి తింటే, ఇంకొందరు నిప్పులలో కాల్చి తింటుంటారు. అయితే పనస తొనలలో ఏ విధంగా పోషకాలు ఉన్నాయో.. పనస విత్తనాలలో కూడా అంతకుమించి పోషకాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
పోషకాలు:పనస గింజల్లో ప్రొటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు(ఒమేగా3, ఒమేగా 6), విటమిన్లు A,C,E,B, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
పనస గింజల ప్రయోజనాలు:
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది:పనస గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని.. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఫైబర్.. ఆహారంలోని చక్కెరను శరీరం గ్రహించే రేటును నెమ్మదిస్తుందని.. ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో హఠాత్తుగా పెరగడం, పడిపోవడాన్ని నివారించడంలో సహాయపడుతుందని అంటున్నారు.
2018లో "జర్నల్ ఆఫ్ డయాబెటిక్ ఫుడ్స్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 8 వారాల పాటు రోజుకు 2 టేబుల్ స్పూన్ల పనస గింజల పొడి తీసుకున్న డయాబెటిస్ వ్యక్తులలో రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ సి.రాజేంద్రన్ పాల్గొన్నారు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:పనస గింజలలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇది మలబద్ధకాన్ని నివారించడానికి, మల పదార్థాల కదలికను సులభతరం చేయడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:పనస గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయని చెబుతున్నారు.