Is Swelling of the face Causes for Fatty Liver Disease: కొన్నిసార్లు చాలా మందికి ముఖం ఉబ్బినట్టుగా కనిపిస్తుంటుంది. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులతో బాధపడేవారు వేసుకునే మందులతో కొందరికి ముఖం ఉబ్బొచ్చు. ఇతరత్రా సమస్యల కోసం స్టిరాయిడ్లు వాడేవారిలోనూ ఇలా కనిపిస్తుంటుంది. అయితే.. ఇవి మాత్రమే కాకుండా ముఖం ఉబ్బడం.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారని చెప్పే ఓ లక్షణం కూడా కావొచ్చని నిపుణులు అంటున్నారు. ఇదే కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా ఫ్యాటీ లివర్ సమస్యకు సంకేతమని అంటున్నారు. అవి ఇప్పుడు చూద్దాం..
మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం(Liver) ఒకటి. ఇది శరీరానికి కావాల్సిన హార్మోన్లను రిలీజ్ చేయడం సహా.. వ్యర్థాలను బయటకు పంపేందుకు సహకరిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావటానికి, రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండటానికీ కాలేయం సాయం చేస్తుంది. ఇలా ఎన్నెన్నో పనుల్లో లివర్ పాలు పంచుకుంటుంది. ఇలాంటి కాలేయానికి ఇప్పుడు కొవ్వు పెద్ద సమస్యగా మారుతోంది. అందుకు కారణం.. ప్రస్తుతం ఎంతోమంది ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్‌తో బాధపడుతుండటమే. అయితే, దీనిపట్ల జాగ్రత్తగా వ్యవహారించకపోతే ప్రాణాలకే ప్రమాదమంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే.. ముఖం ఉబ్బినట్లు అనిపించడంతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తాయంటున్నారు.
ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది :మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లయితే.. అప్పుడు కాలేయం అల్బుమిన్ అనే ప్రోటీన్‌ను తగినంతగా ఉత్పత్తి చేయలేకపోతుంది. అల్బుమిన్ రక్తంలో ద్రవాన్ని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఒకవేళ అల్బుమిన్ తక్కువగా ఉంటే.. ద్రవం రక్తనాళాల నుంచి కణజాలంలోకి లీక్ అవుతుంది. ఫలితంగా మీ ముఖం కొద్దిగా ఉబ్బినట్లు కనిపించడాన్ని గమనించవచ్చంటున్నారు నిపుణులు. 2022లో జర్నల్ ఆఫ్ క్లినికల్ హెపటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లైతే ముఖం ఉబ్బే ప్రమాదం 30 శాతం అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని షాంఘైలోని జియా టాంగ్ విశ్వవిద్యాలయం అనుబంధిత రుయిజిన్ ఆసుపత్రిలోని హెపటాలజీ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ లీ పాల్గొన్నారు.
ఫ్యాటీ లివర్ సమస్యా? - ఒక్క స్పూన్‌తో చెక్ పెట్టండి!
దద్దుర్లు :చర్మంపై దద్దుర్లు కూడా ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారని తెలిపే ఒక సంకేతమని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య ఉన్నప్పుడు మీ శరీరం కొన్ని పోషకాలను సమర్థవంతంగా గ్రహించుకోలేదని.. ఫలితంగా చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయంటున్నారు. ముఖ్యంగా నోటి చుట్టూ చిన్న గడ్డలు ఏర్పడి చికాకుకు దారితీస్తుందంటున్నారు.
డార్క్ స్కిన్ :ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ ఇన్సులిన్ నిరోధకతను పెంచడానికీ దోహదం చేస్తుంది. అంటే.. మీ శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేదు. ఇది మీ శరీరంలో అదనపు ఇన్సులిన్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఫలితంగా మెడ దగ్గర చర్మం నల్లగా మారడం, స్కిన్‌పై మడతలు ఏర్పడడాన్ని గమనించవచ్చంటున్నారు నిపుణులు.