Sweating Health Benefits And Side Effects :అందరికీ దాదాపు ఏదో ఒక సందర్భంలో చెమటలు వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు చిరాగ్గా, అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. దాంతో చాలా మంది ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తుంటారు. మరి.. చెమటలు రావడం ఆరోగ్యానికి మంచిదేనా? లేదంటే హానికరమా? అనే సందేహాలు చాలా మందిలో వస్తుంటాయి. మరి.. ఈ సందేహాలకు నిపుణులు ఎలాంటి సమాధానాలు చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చెమట వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :
- శరీరానికి చెమటలు పట్టడం అనేది ఆరోగ్యానికి చాలా విధాలా మేలే చేస్తుందని సూచిస్తున్నారు దిల్లీకి ప్రముఖ డెర్మటాలజిస్ట్ మహాజన్. చెమటలు బాక్టీరియా పెరుగుదలను తగ్గించి.. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయని ఆయన సూచిస్తున్నారు.
- అలాగే.. 2016లో 'జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. చెమట చర్మం pH ను తగ్గిస్తుందని, ఇది బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుందని కనుగొన్నారు.
- చెమటలు స్వేధ రంధ్రాలలో పేరుకుపోయిన అదనపు ధూళి, నూనె, మలినాలు వంటివి తొలగించడంలో సహాయపడతాయి. అలాగే చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికీ చెమట హెల్ప్ చేస్తుంది. తద్వారా మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు తలెత్తకుండా కూడా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు. ఫలితంగా చర్మ ఆరోగ్యమూ మెరుగుపడుతుందని చెబుతున్నారు.
- చెమట ద్వారా శరీరంలోని అధిక ఉప్పు బయటికి వెళ్లిపోతుంది. అలాగే ఎముకలకు సరిపడినంత కాల్షియం అందుతుంది. తద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా జాగ్రత్తపడచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
నిద్రలో చెమటలు పడుతున్నాయా? - ఉక్కపోత వల్ల అని లైట్ తీసుకుంటే డేంజర్లో పడ్డట్టే!
- చెమట వల్ల చర్మానికి రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుందంటున్నారు.
- చెమట శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను చల్లబరుస్తుంది. అలాగే మీ చర్మాన్ని హైడ్రేట్, తేమగా ఉంచుతుందని డాక్టర్ మహాజన్ సూచిస్తున్నారు. అయితే.. ఇలా చెమట పట్టడం మంచిదే అయినా.. అధికంగా చెమటలు పట్టడం మాత్రం ఆరోగ్యానికి హాని కలిగించవచ్చంటున్నారు.