Which Water is Best for Pregnant to Take Bath:కొందరికి సీజన్‌తో సంబంధం లేకుండా డైలీ వేడినీళ్లతో స్నానం చేసే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా కొందరు మహిళలైతే మండు వేసవిలో కూడా వేడినీళ్లతోనే స్నానం చేస్తుంటారు. అయితే గర్భిణులు మాత్రం వేడినీళ్ల స్నానం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. మామూలు రోజుల్లో మాదిరిగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా హాట్ వాటర్‌తో స్నానం చేయాలనుకుంటే మాత్రం.. బేబీ ఆరోగ్యానికి చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఎందుకో తెలియాంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
జనరల్‌గా ప్రెగ్నెంట్ అయినప్పుడు మొదటి మూడు నెలలు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే.. ఈ పీరియడ్‌లో బేబీ ఆర్గాన్స్, బ్రెయిన్ డెవలప్మెంట్, నాడీ సంబంధిత ఫంక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అందుకే.. ఈ ట్రైమిస్టర్ను ఆర్గాన్స్ జెనెసిస్ పీరియడ్ అంటారు. కాబట్టి బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే ఈ టైమ్‌లో గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరమంటున్నారు ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ రజిని. అందులో భాగంగానే స్నానం చేసే విషయంలోనూ ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు.
వేడినీళ్ల స్నానం తగ్గించండి!:ముఖ్యంగా గర్భిణులు వీలైనంత వరకు చన్నీళ్లతో(Cold Water)స్నానం చేయడం మంచిదంటున్నారు డాక్టర్ రజిని. అలాకాకుండా.. బాగా మరిగిన వేడి నీటితో స్నానం చేయడం గర్భిణీలకు ఏమాత్రం మంచిది కాదంటున్నారు. అలా చేయడం వల్ల పుట్టే శిశువుల్లో పలు ఆరోగ్య సమస్యలకు దారితీసే ఛాన్స్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే, చన్నీళ్లతో స్నానం చేయడం ఇబ్బందిగా ఉంటే.. మరీ వేడి నీళ్లు కాకుండా కాస్త గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం బెటర్ అంటున్నారు.
అలా చేస్తే ఈ సమస్యలు రావొచ్చు :జనరల్‌గా గర్భిణీల్లో మొదటి ట్రైమిస్టర్లో బాడీ టెంపరేచర్ ఎప్పుడైతే 102, 104 డిగ్రీల ఫారన్ హీట్ దాటిందో.. ఆ టైమ్‌లో టెంపరేచర్ పెరగడం వల్ల బేబీస్‌లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు డాక్టర్ రజిని. అంటే.. బేబీ శరీరంలో స్పైనల్ అబ్నార్మాల్టీస్, బ్రెయిన్ అబ్నార్మాల్టీస్కు దారి తీసే అవకాశం ఉంటుందట. అదే సమయంలో వేడినీళ్లతో గర్భిణీలు స్నానం చేయడం వల్ల వారి బాడీ టెంపరేచర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ కారణంగా పుట్టే పిల్లల్లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు రజిని. అంతేకాదు.. కొన్ని అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైనట్లు ఆమె పేర్కొంటున్నారు.
అంతేకాదు.. మసులుతున్న నీళ్లతో స్నానం చేసినప్పుడు గర్భిణులకు బీపీ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. దాంతో బిడ్డలకు ఆక్సిజన్, న్యూట్రియంట్స్ సరిగా అందవు. ఆ సమస్య తీవ్రమైన సందర్భాల్లో అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. కాబట్టి, వీలైనంత వరకు గర్భిణీలు వేడినీళ్ల స్నానానికి దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.