Is Ghee Good For Skin : అన్నం, పప్పు, ఆవకాయ, నెయ్యి, ఆహా! ఈ ఆలోచనే అద్భుతం కదా! అసలు నెయ్యి ఎందులో వేసినా రుచే. స్ఫైసీగా చేసుకునే బిర్యానీ నుంచి కమ్మగా తియ్యగా ఉండే స్వీట్ల వరకూ ప్రతి దాంట్లో నెయ్యి ఉండాల్సిందే. రుచిలోనే కాదు ఆరోగ్య ప్రయోజనాల్లోనూ నెయ్యి ఎక్కడా ఏం తక్కువ చేయదు. ఎన్నో రకాల పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉండే నెయ్యిని తినడం వల్ల అధిక రక్తపోటు, అజీర్తి, మలబద్ధకం, బలహీనమైన కీళ్ళు, ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్, పీసీఓఎస్ సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యానికి, నాడీ వ్యవస్థ పనితీరుకు కూడా ఈ పాల పదార్థం చాలా బాగా సహామపడుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలకు కూడా నెయ్యి సాంప్రదాయ ఔషధంగా పనిచేస్తుంది. అందుకే ఇండియన్ కిచెన్ లో దీనికి ప్రాముఖ్యత ఎక్కువ.
నెయ్యి కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా చాలా మేలు చేస్తుందట. వాపు, మంట, అలెర్జీలు వంటి ఎన్నో చర్మ సమస్యలకు చికిత్స చేయగల శక్తి ఈ పాల పదార్థానికి ఉంటుందట. మనం తరచూ వాడే చాలా బ్యూటీ క్రీముల్లో నెయ్యిని వినియోగిస్తారట. నెయ్యి తినడం లేదా అప్లై చేసుకోవడం వల్ల చర్మానికి కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఆలస్యం చేయకుండా చూసేద్దామా మరి.
చర్మ పోషణ
ఒమేగా కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే నెయ్యి చర్మానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ ను తటస్తం చేయడంలో సహాయపడుతుంది. చర్మానికి మంచి పోషనతో పాటు తేమను అందించి ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్ని మీ సొంతం చేస్తుంది. ముఖ్యంగా డల్ స్కిన్ ఉన్నవారికి నెయ్యిని చక్కగా ఉపయోగించుకోవచ్చు.
స్కిన్ హైడ్రేషన్
నెయ్యిలో ఉండే విటమిన్-ఏ, ఫ్యాటీ యాసిడ్లు వంటి పోషకాలు చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచేందుకు తోడ్పడతాయి. దురద, దద్దుర్లు, అలెర్జీ లాంటి సమస్యలను నుంచి పోరాడే శక్తిని చర్మ రోగ నిరోధక వ్యవస్ధకు అందిస్తుంది. వీటితో పాటు చర్మానికి ఆర్ద్రీకరణ అందించి మంచి పోషణనిస్తుంది.