Is Coffee and Tea Reduced Cancer Risk:చాలా మందికి.. ఓ కప్పు కాఫీ లేదా టీ అనేది ఓ ఎమోషన్. డైలీ రొటీన్‌ను టీ లేదా కాఫీతో మొదలుపెట్టేవారు లెక్కకుమించి. మరి మీరు కూడా వీటిని తాగుతుంటారా? కుదిరితే కప్ కాఫీ అంటూ ఎప్పుడు వీలైతే అప్పుడు కప్పుల కొద్దీ కాఫీలు తాగేస్తుంటారా? అయితే మీకో గుడ్ న్యూస్. అదేంటంటే.. రోజుకి కొన్ని కప్పుల కాఫీ లేదా టీ తాగే వారికి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
తల, మెడ క్యాన్సర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏడవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఎక్కువగా ఉన్న వారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం అంటున్నారు. రోజూ నాలుగు కప్పుల కాఫీ తాగిన వారిలో ఈ క్యాన్సర్ ముప్పు తగ్గే అవకాశం ఉందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పీర్ రివ్యూడ్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడిమియాలజీ కన్సార్టియంతో అనుసంధానమైన పలువురు శాస్త్రవేత్తలు సుమారు 14 అధ్యయనాల నుంచి డేటాను పరిశీలించారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
పరిశోధన వివరాలు :సుమారు 25వేల మందికి పైగా వ్యక్తుల నుంచి సేకరించిన డేటా ప్రకారం.. కాఫీ, టీలు తాగడం వల్ల ఉత్సాహంగా ఉండటమే కాకుండా తల, మెడ క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని కనుగొన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్నవారు రోజు/వారం/నెల/సంవత్సరానికి కప్పులలో కాఫీ, కెఫిన్ లేని కాఫీ, టీని తీసుకోవడం గురించి ప్రశ్నపత్రాలను పూర్తి చేశారు.
తల, మెడ క్యాన్సర్‌తో బాధపడుతున్న 9,548 మందిని, 15,783 మంది క్యాన్సర్ లేని వారిపై పరిశోధన చేయగా.. కాఫీ తాగని వారితో పోలిస్తే.. ప్రతిరోజూ 4 కప్పుల కంటే ఎక్కువ కెఫెన్ కలిపిన కాఫీ తాగే వ్యక్తులకు తల, మెడ క్యాన్సర్ వచ్చే అవకాశం 17% తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. అలాగే నోటి కుహరంలో క్యాన్సర్ వచ్చే అవకాశం 30% తక్కువని, గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశం 22% తక్కువని కనుగొన్నారు. అలాగే రోజూ 3-4 కప్పుల కెఫెన్ కాఫీ తాగడం వల్ల హైపోఫారింజియల్ క్యాన్సర్ (గొంతు దిగువన ఉండే ఒక రకమైన క్యాన్సర్) వచ్చే ప్రమాదం 41% తక్కువగా ఉంటుందని కనుగొన్నారు.