Iron Deficiency Warning Signs :మన శరీరానికి అవసరమైన, అత్యంత ముఖ్యమైన పోషకాల్లో ఐరన్ ఒకటి. మెదడు పనితీరుకు, మానసిక పరిస్థితికి, రోగ నిరోధక వ్యవస్థకు, కండరాలు బలంగా ఉండడానికి, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి బాడీలో సరిపడా ఐరన్ ఉండాలి. పిల్లల్లో మెదడు ఆరోగ్యంగా ఎదగడానికి ఇది చాలా అవసరం. అందుకే శరీరానికి తగినంత ఐరన్ లభించేలా చూసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. లేదంటే ఐరన్ లోపం(Iron Deficiency)తలెత్తి రక్తహీనతకు గురికావడంతో పాటు తీవ్ర ఆరోగ్య సమస్యలు రావొచ్చంటున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే గుండెనొప్పికి దారితీసి ప్రాణం పోయే ఛాన్స్ కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ముందు జాగ్రత్తగా మీలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే మీకు ఐరన్ లోపం ఉన్నట్టు తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అలసట :మీలో ఐరన్ లోపం తలెత్తితే కనిపించే ప్రధానమైన లక్షణం అలసట. చిన్న చిన్న పనులకి కూడా అలసట వస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా ఈ లక్షణంతో ఇబ్బందిపడవచ్చు. మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గినప్పుడు అలసట వస్తుంది.
శ్వాస ఆడకపోవడం : ఈ సమస్య ఐరన్ లోపం సంభవిస్తుంది. బాడీలో తగినంత ఐరన్ స్థాయిలు లేకపోతే రక్తంలో ఆక్సిజన్ వాహక సామర్థ్యం తగ్గుతుంది. ఫలితంగా వ్యక్తులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇదే కాకుండా శారీరక శ్రమ లేదా కఠినమైన కార్యకలాపాల సమయంలో ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
పాలిపోయిన చర్మం, గోర్లు :బాడీలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం కారణంగా పెదవులు, గోర్లు, చర్మం పాలిపోయినట్లు కనిపిస్తోంది. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ కావాలంటున్నారు నిపుణులు.
తలనొప్పి : ఐరన్ లోపం ఉంటే తలనొప్పి, తరచూ మైకం కమ్మినట్టు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. ఐరన్ స్థాయిలు తక్కువగా ఉంటే అది రక్తనాళాల మార్పులకు దారి తీయడంతో పాటు మెదడుకు ఆక్సిజన్ సరఫరా బలహీనపరుస్తుంది.