Turmeric Coffee Recipe : "కాఫీ.." దీన్ని ప్రేమించే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డైలీ మార్నింగ్, ఈవెనింగ్ టైమ్‌లో చాలా మందికి స్ట్రాంగ్ కాఫీ ఉండాల్సిందే. పని ఒత్తిడితో బుర్ర హీటెక్కిపోతే మధ్యాహ్నం కూడా కాఫీ పడాల్సిందే. ఇలాంటి కాఫీలో ఎన్నో రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. అంతలా కాఫీ మన లైఫ్‌లో ఒక భాగమైపోయింది.
అయితే.. ఇప్పుడు మరో రకం కాఫీ ట్రెండింగ్‌లో ఉంది. తనదైన టేస్ట్‌తో జనాలను ఆకర్షిస్తోంది. అదే "పసుపు కాఫీ". దీన్నే 'గోల్డెన్ మిల్క్ లాటే' అని కూడా పిలుస్తారు. ఈ రోజుల్లో జనాలకు ఆరోగ్య స్పృహ చాలా పెరిగింది. ఇలాంటి వాళ్లంతా ఆరోగ్యానికి మంచిదని పసుపు కాఫీని సిప్ చేస్తున్నారు. మరి, ఈ టర్మరిక్ కాఫీతో ఎలాంటి లాభాలు ఉన్నాయి? నిపుణులు ఏం చెబుతున్నారు? దీన్ని ఎలా తయారు చేయాలి ? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
లాభాలు..
- పసుపులోని కుర్క్యుమిన్తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, రోగనిరోధకతను పెంచే లక్షణాలు అధికంగా ఉంటాయి.
- ఇది కాఫీతో కలిసినప్పుడు టేస్ట్ పెరగడమే కాదు.. బోలెడు ఆరోగ్యప్రయోజనాలనూ అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- దీంతో ప్రస్తుతం ఈ పసుపు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఈ కాఫీ ఒంట్లో చురుకుదనం పెంచడంతోపాటు బాడీలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది.
- ఆర్థరైటిస్, కండరాల నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. కాఫీ, పసుపు రెండింట్లోనూ యాంటీఆక్సిడెంట్లు అధికం. ఇవి కలిసి కణాలను రిపేర్ చేసి, వృద్ధాప్యఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటాయి.
- యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చలికాలంలో వచ్చే జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లకు చెక్ పెడతాయి.
- సాధారణంగా కాఫీలోని ఎసిడిక్ లక్షణాలు గ్యాస్‌కి కారణమవుతాయి. కానీ.. పసుపుతో చేసిన ఈ కాఫీ కడుపుబ్బరం, అజీర్తి వంటివి తొలగించడమే కాదు.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.
- మెదడు, గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది.