Rose Tea Health Benefits in Telugu:ఉద్యోగం, వ్యాపారం, ఉన్నత చదువులు ఇలా ఏ పనిలో రాణిస్తున్నా మనిషికి కాస్త ఒత్తిడి కలుగుతుంది. టెన్షన్ లేకుండా దాదాపు ఏ పనీ ఉండదు. అయితే, ఇది తీవ్రమైతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా, ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు గులాబీరేకల టీ తాగితే ఉపశమనం పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఒక్క టీ తాగితేటెన్షన్లన్నీ తొలగిపోయే మనసు హాయిగా మారిపోతుందట.
గులాబీరేకలలో విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ సి, ఫినోలిక్ సమ్మేళనాలు, కెరోటినాయిడ్స్, టోకోఫెరోల్, బయోఫ్లేవనాయిడ్స్, టానిన్లు, పెక్టిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయని అంటున్నారు. ఇదే విషయాన్ని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిపుణుల బృందం కూడా వెల్లడించింది. (రిపోర్ట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.) మరి ఇంట్లో ఉండే పదార్థాలతో కమ్మగా గులాబీరేకల టీ ఎలా తయారు చేయాలి ? దాని తయారీకి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు :
- మూడు కప్పుల పాలు
- మూడు స్పూన్ల చొప్పున -టీపొడి, చక్కెర
- మూడు యాలకులు
- ఒక అనాసపువ్వు
- జీడిపప్పు-10
- బాదంపప్పు-10
- రెండు టేబుల్‌స్పూన్లు -నీటిలో నానబెట్టి చేసిన గులాబీరేకల పేస్టు
- రెండు కప్పుల నీరు
తయారీ విధానం :
- ముందుగా మిక్సీ గిన్నెలోకి నీటిలో నానబెట్టిన జీడిపప్పు, బాదంపప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. (ఇది టీ కోసం పావుకప్పు తీసుకోవాలి.)
- ఇప్పుడు స్టౌపై పాత్ర పెట్టి అందులో రెండు కప్పుల నీటిని వేడి చేయండి.
- దీనిలో టీపొడి, గులాబీరేకల పేస్టు, అనాసపువ్వు, యాలకులు వేసి చిక్కగా బాగా మరిగించండి.
- ఈ డికాక్షన్ వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోండి.
- ఇప్పుడు మరొక పాత్రలో పాలు, చక్కెర వేసి మరగబెట్టండి.
- పాలు మరిగేటప్పుడు, దీనిలో బాదం, జీడిపప్పుల పేస్టు పావుకప్పు వేసి బాగా కలపండి.
- పాలు మరిగిన తర్వాత, అందులో ముందుగా తయారు చేసిన డికాక్షన్‌ను వేసి కలపండి.
- అయిదు నిమిషాలు మరగించిన తర్వాత.. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
- ఘుమఘుమలాడే కమ్మటి గులాబీ ఛాయ్ మీ ముందుంటుంది.