తెలంగాణ

telangana

ETV Bharat / health

మీ పిల్లలు బరువు తక్కువగా ఉన్నారా? ఇలా చేస్తే పక్కా హెల్దీగా మారతారట! - HOW TO INCREASE CHILD WEIGHT

-సరిగ్గా తిన్నా కూడా పిల్లలు బరువు పెరగట్లేదా? -ఇవి పాటిస్తే పిల్లలు బరువు పెరుగుతారని నిపుణుల సలహా

How to Help Underweight Child Gain Weight:
How to Help Underweight Child Gain Weight: (Getty Images)

By ETV Bharat Health Team

Published : Jan 17, 2025, 3:32 PM IST

How to Help Underweight Child Gain Weight: అధిక బరువు వల్లనే కాకుండా.. బరువు తక్కువగా ఉండడం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల బరువు గురించి బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే వారిని వైద్యులకు చూపించి.. సలహాలను క్రమం తప్పకుండా పాటించాలని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే మరీ తక్కువ బరువున్న పిల్లలు బరువు పెరగాలంటే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బలవంతపెట్టొద్దు!
పిల్లలు బరువు తక్కువగా ఉన్నారని.. వాళ్లకు ఎలాగైనా ఆహారం తినిపించాలని నిర్ణయించుకుని బలవంతంగా తినిపిస్తుంటారు కొంతమంది తల్లులు. ఇలా చేయడం వల్ల తినే ఆహారంపై వారికి ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. పైగా ఈ పద్ధతి వల్ల వారు తినకుండా మరింత మొండికేస్తుంటారని వివరిస్తున్నారు. దీనివల్ల వారికి అందాల్సిన పోషకాలు పూర్తిగా అందకుండా పోతాయని చెబుతున్నారు. కాబట్టి పిల్లల్ని ఆహారం విషయంలో బలవంతపెట్టకుండా వారి కోసం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. ఏ పదార్థాలు, స్నాక్స్ ఇవ్వాలో ఓ ప్రణాళిక తయారుచేయాలని సూచిస్తున్నారు. దాని ప్రకారం వారికి పోషకాహారం అందించాలని సలహా ఇస్తున్నారు. ఫలితంగా వారికి కావాల్సిన పోషకాలు అంది.. శరీర బరువు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

వీటికి దూరంగా
మనలో చాలామంది తల్లలు.. పిల్లలకు తినపించడం కోసం టీవీ, ఫోన్లు చూడడానికి ఇస్తుంటారు. దీంతో మామూలు సమయాల్లో టీవీ చూడనివ్వట్లేదని, కనీసం తినే సమయంలోనైనా టీవీ చూడచ్చని చాలామంది పిల్లలు ఆనందిస్తుంటారు. ఇక ఈ సాకుతో గంటలు గంటలు తినడానికే వృథా చేస్తుంటారని నిపుణులు అంటున్నారు. ఇలా తినడం వల్ల వారి ధ్యాసంతా ఆహారం మీద కంటే టీవీ మీదే ఎక్కువగా ఉంటుందని.. దీంతో ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? అనే విషయాలేవీ వారు పట్టించుకోరని వివరిస్తున్నారు. అందులోని రుచి వారికి తెలియదని.. ఇలా ఆహారం తీసుకోవడంపై మనసు లగ్నం చేయకపోవడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. కాబట్టి పిల్లలు తినే సమయంలో టీవీ ఆఫ్ చేసేయడం, మొబైల్స్, కంప్యూటర్, ల్యాప్‌టాప్స్ వంటి గ్యాడ్జెట్లు వారికి దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. అలాగే వీటిపైకి మనసు మళ్లకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పక్కనే కూర్చొని పిల్లలు తినే ఆహార పదార్థాలపై వారికి అవగాహన కల్పించాలని సలహా ఇస్తున్నారు. దానికి తగినట్టుగానే ఆహారం రంగు, రుచి, వాసన ఉండేలా చూసుకోవాలని.. తద్వారా వారిలో ఆహారం పట్ల ఆసక్తి కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

క్యాలరీలూ ఆరోగ్యకరంగానే
పిల్లలు వయసుకు తగ్గ బరువు ఉండాలంటే ముందుగా వారికి ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారపదార్థాలు అందించాలని నిపుణులు చెబుతున్నారు. అలాగని కేక్‌లు, స్వీట్లు, పిజ్జా, బర్గర్లు వంటివి పెట్టకూడదని అంటున్నారు. చిక్కటి పాలు, మీగడ పెరుగు, ఆహారంలో భాగంగా నెయ్యి వంటి పదార్థాలతో పాటు విటమిన్లు, ఖనిజాలు అధికంగా లభించే పండ్లు, కూరగాయల్ని కూడా వారి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై సరైన అవగాహన లేకపోతే సంబంధిత పోషకాహార నిపుణులను సంప్రదించి వారు సూచించే ఆహారాన్ని పిల్లలకు రోజూ అందివ్వాలని సలహా ఇస్తున్నారు. 2020లో Journal of Pediatric Gastroenterology and Nutritionలో ప్రచురితమైన"Caloric intake and growth in underweight children: a systematic review" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఎప్పటికప్పుడు
వయసు, ఎత్తు ఆధారంగా ఉండాల్సిన బరువును నిర్ణయిస్తారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ముందుగా వైద్యులను సంప్రదించి వారి ఎత్తు, వయసు ప్రకారం వారు ఎంత బరువుండాలో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. తర్వాత వారు అందించే సూచనలు పాటిస్తూ పిల్లల బరువును క్రమంగా పెంచేందుకు ప్రయత్నించాలని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు వారు ఎంత బరువు పెరుగుతున్నారు? ఒకవేళ ఉండాల్సిన దానికంటే బరువు ఎక్కువైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తక్కువైతే పెంచాల్సిన మార్గాలు ఏంటి? అన్న విషయాలన్నింటిపై తల్లిదండ్రులకు మంచి అవగాహన ఉంటే మంచిదని అంటున్నారు. కాబట్టి వారు సరైన బరువు ఉండాలంటే ఇలా ఎప్పటికప్పుడు వారి బరువును చెక్ చేస్తూ తగిన జాగ్రత్తలు పాటించడం ముఖ్యమని తెలిపారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

తిన్న వెంటనే ఆకలి వేస్తుందా? ఇలా ఎందుకు అవుతుందో తెలుసా?

మూత్రంలో రక్తం పడితే క్యాన్సర్ వచ్చినట్లేనా? డాక్టర్లు ఏం అంటున్నారంటే?

ABOUT THE AUTHOR

...view details