Hormonal Imbalance in Women: ప్రస్తుతం చాలామంది మహిళలు ఎదుర్కొంటోన్న సమస్య హార్మోన్ల అసమతుల్యత. దీనివల్ల అధిక బరువు, బద్ధకం, నిద్ర పట్టకపోవడం, నెలసరి సంబంధిత సమస్యలు వంటివి తలెత్తుతుంటాయని నిపుణులు అంటున్నారు. అయితే, ఇలా జరగకుండా హార్మోన్లను సమతులంగా ఉంచుకోవాలంటే ఈ చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫైబర్ ఎక్కువగా!
హార్మోన్లను సమతులంగా ఉంచుకోవడానికి మనం తీసుకునే ఆహారంలో కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు తగినంత మొత్తంలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కాయగూరలు, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇది రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని సమన్వయపరుస్తుందని వివరిస్తున్నారు. అలాగే ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి, యాపిల్, జామ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుందని అంటున్నారు.
కొబ్బరి నూనెతో
హార్మోన్ల సమతుల్యతకు కొబ్బరి నూనె సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా శరీరంలో వివిధ హార్మోన్ల స్థాయుల్ని ఇది క్రమబద్ధీకరిస్తుందని వివరిస్తున్నారు. అందుకే ఈ నూనెతో వంటకాలు చేసుకొని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే బరువును అదుపులో ఉంచుకునేందుకూ ఈ చిట్కా ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు.
వెజిటబుల్ ఆయిల్స్
మన శరీరంలో కొవ్వుల పాత్ర చాలానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో హార్మోన్ల ఉత్పత్తికి, వివిధ కణాలు తిరిగి నిర్మితమవడానికి కొవ్వులు ఎంతో ఉపయోగపడతాయని వివరిస్తున్నారు. వెజిటబుల్ ఆయిల్స్‌లో అధిక మొత్తంలో ఉండే పాలీశ్యాచురేటెడ్ కొవ్వులు ఈ పనుల్ని సమర్థంగా నిర్వర్తిస్తాయని అంటున్నారు. కాబట్టి వంటకాల్లో ఈ నూనెల్ని వాడటం మంచిదని సలహా ఇస్తున్నారు.