తెలంగాణ

telangana

ETV Bharat / health

మీ వయసు ప్రకారం రోజుకు ఎంత సేపు నిద్రపోవాలి? ఈ టిప్స్ పాటిస్తే సుఖంగా నిద్రపోతారు! - HOW MUCH SLEEP NEEDED BY AGE

-వయసు ప్రకారం ఎవరు ఎంత సేపు పడుకోవాలి? -హాయిగా నిద్ర పోయేందుకు పాటించాల్సిన టిప్స్!

How Much Sleep Needed by Age
How Much Sleep Needed by Age (Getty Images)

By ETV Bharat Health Team

Published : Feb 7, 2025, 5:15 PM IST

How Much Sleep Needed by Age:మనం ఆరోగ్యంగా ఉండడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, కొంతమంది నిద్ర పట్టక బాధపడుతుంటే.. మరికొందరేమో అతిగా నిద్ర పోతుంటారు. అయితే నిద్ర తక్కువైనా, ఎక్కువైనా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే వయసును బట్టి ఎవరికి ఎన్ని గంటలు నిద్ర అవసరం ఉంటుంది. ఒకవేళ నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే దానిని అధిగమించడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ వయసు ప్రకారం రోజుకు ఎంత సేపు నిద్రపోవాలి? (Getty Images)

ఎవరికి ఎన్ని గంటలు?

  • అప్పుడే జన్మించిన పిల్లలు : 14-17 గంటలు (మధ్యాహ్న నిద్రతో కలిపి)
  • ఏడాది లోపు పిల్లలు : 12-15 గంటలు (మధ్యాహ్న నిద్రతో కలిపి)
  • 1-2 ఏళ్ల వయసున్న చిన్నారులు : 11-14 గంటలు (మధ్యాహ్న నిద్రతో కలిపి)
  • 3-5 ఏళ్ల వయసున్న పిల్లలు : 10-13 గంటలు
  • పాఠశాలకు వెళ్లే పిల్లలు (6-12 ఏళ్లు) : 9-11 గంటలు
  • టీనేజర్లు (13-19 ఏళ్లు) : 8-10 గంటలు
  • పెద్దలు : 7-9 గంటలు
  • వృద్ధులు : 7-8 గంటలు
మీ వయసు ప్రకారం రోజుకు ఎంత సేపు నిద్రపోవాలి? (Getty Images)
మీ వయసు ప్రకారం రోజుకు ఎంత సేపు నిద్రపోవాలి? (Getty Images)

ఇలా చెక్‌ పెట్టచ్చు!

  • అయితే, ఒకవేళ మీరు నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే రోజువారీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
  • ప్రతి రోజు ఒకే తరహా నిద్ర సమయాల్ని పాటించాలి. వారాంతాలు, సెలవు రోజుల్లో కూడా నిర్ణీత వేళకే నిద్ర పోవడం, మేల్కోవడం అలవాటు చేసుతకోవాలి.
  • ఇంకా కొంతమందికి రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టక ఉదయం ఆలస్యంగా లేస్తుంటారు. అలాంటి వాళ్లు నిద్రకు ఉపక్రమించేలా పడకగదిలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఉంచుకోవాలి. అలాగే ముఖ్యంగా నిద్రకు ఆటంకం కలిగించే ఎలక్ట్రానిక్ పరికరాలను దూరం పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు కాఫీ, టీ వంటివి అస్సలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని కెఫీన్‌కు నిద్రను భంగం చేసే లక్షణముందని వివరిస్తున్నారు. 2019లో Journal of Clinical Sleep Medicineలో ప్రచురితమైన "Caffeine's Effects on Sleep and Sleep Disorders" అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మీ వయసు ప్రకారం రోజుకు ఎంత సేపు నిద్రపోవాలి? (Getty Images)
మీ వయసు ప్రకారం రోజుకు ఎంత సేపు నిద్రపోవాలి? (Getty Images)
  • ఇంకా మధ్యాహ్నం ఎక్కువసేపు పడుకోవడం వల్ల కూడా రాత్రుళ్లు నిద్ర పట్టదని అంటున్నారు. కాబట్టి పగలు అరగంటకు మించి కునుకు తీయకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు.
  • వ్యాయామాల వల్ల ఆరోగ్యమే కాకుండా.. నిద్ర సమయాలు కూడా అదుపులో ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో శరీరం అలసిపోయి తద్వారా నిద్రలేమిని కూడా అధిగమించచ్చని సూచిస్తున్నారు.
  • అలాగే ఆహారంలోనూ పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సుఖ నిద్రను ప్రేరేపించే పాలు, పాల పదార్థాలు, బాదం, కివీ పండ్లు, చామొమైల్‌ టీ వంటివి తరచూ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
  • వీటితో పాటు మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లను దూరం పెట్టడమూ ముఖ్యమేనని చెబుతున్నారు. అయితే ఇన్ని చేసినా సుఖ నిద్ర కరువైనా, ఇతర అనారోగ్యాలు వేధిస్తున్నా వెంటనే సంబంధిత నిపుణుల్ని సంప్రదించాలని అంటున్నారు. ఫలితంగా సమస్య తీవ్రం కాకుండా జాగ్రత్తపడచ్చని వివరిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రోజూ రాత్రి రీల్స్ చూస్తున్నారా? పరిశోధనలో కీలక విషయాలు- ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవట!

గుడ్లు ఎలా ఉడికించాలో మీకు తెలుసా? కరెక్ట్ పద్ధతి ఇదేనని శాస్త్రవేత్తల వెల్లడి- ఇంకా లాభాలెన్నో!

ABOUT THE AUTHOR

...view details