Effect Of Using Dirty Sponge In Kitchen :కిచెన్‌ను క్లీన్ చేసేందుకు చాలా మంది వినియోగించే వాటిలో స్పాంజ్ ప్రధానమైంది. గిన్నెలు తోమడానికి, వంటగదిలో నేలపై పడ్డ మరకలను తుడవడానికో కచ్చితంగా దీన్ని వాడుతుంటారు. అయితే సరిగ్గా వాడకపోతే ఇది మొత్తం కిచెన్ అంతా బ్యాక్టీరియాను వ్యాపింపజేస్తుందనీ, ఇది మీ ప్రేగులకు పెద్ద ప్రమాదం తెచ్చిపెడుతుందని మీలో ఎంత మందికి తెలుసు. ఒక్క మురికి స్పాంజ్ కొన్ని వేల ప్రమాదకరమైన బ్యాక్టీరియాలకు బీజం వేస్తుంది. ఫలితంగా మన ఆహారం కలుషితమై రకరకాల సమస్యలను తెచ్చిపెడుతుంది.
సాధారణంగా చాలా వరకూ స్పాంజ్‌లను ఏదైనా లిక్విడ్స్‌ను పీల్చుకోవడానికి వినియోగిస్తాం. ఈ స్పాంజ్‌లు అన్నీ కూడా సెల్యూలోజ్, ఉరేతన్, ఫోమ్‌తో తయారుకావడం వల్ల లిక్విడ్స్‌ను వేగవంతంగా శోషించుకుంటాయి. కొన్నిసార్లు స్క్రబ్బింగ్ చేసేందుకు వీలుగా ఉండాలని సింథటిక్ స్పాంజ్‌లను కూడా వాడుతుంటారు. వీటిలో ఏదైనా సరే అవసరానికి వాడేసి, తరువాత వాటన్నిటిని ఒక మూలన పెట్టేస్తుంటారు. అక్కడే వస్తుంది అసలు సమస్య. పరిసరాలను క్లీన్ చేసిన స్పాంజ్‌లను గోడలకు ఓ మూలన ఉంచేస్తే, అక్కడ బ్యాక్టీరియా పెరిగేందుకు అనువుగా ఉంటుంది. ఆ స్పాంజ్‌లలో ఉన్న మిగిలిపోయిన ఆహారపదార్థాలు బ్యాక్టీరియాను క్రియేట్ చేస్తాయి. అలా బ్యాక్టీరియాతో పేరుకుపోయిన స్పాంజ్‌లతో తిరిగి పరిసరాలను శుభ్రం చేసినప్పుడు అదంతా వంట గది ఉపరితలాలకు అంటుకుపోతుంది. అక్కడ ఏవైనా ఆహార పదార్థాలు ఉంచినప్పుడు వాటికి వ్యాప్తించి పేగుల్లో ఇన్ఫెక్షన్స్ పెరిగేందుకు కారణమవుతాయి.