Neck Pain Relief : రకరకాల కారణాలతో మెడనొప్పి వేధిస్తుంటుంది. దీంతో మెజార్టీ జనాలు పెయిన్ కిల్లర్స్, వివిధ రకాల పెయిన్ బామ్స్ వాడుతుంటారు. ఇవి భరించలేని నొప్పి నుంచి కాస్త ఉపశమనం పొందేలా చేసినా.. శ్వాశ్వత పరిష్కారాన్ని మాత్రం చూపించవు. ఇలాంటి వారు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మెడ నొప్పిని తగ్గించుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
మెడనొప్పి సమస్య ఉంటే అది రాత్రి ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది. అయితే.. ఈ నొప్పి ఒక్కసారిగా రాదు. మీరు కంప్యూటర్ ముందు తప్పుడు భంగిమలో ఎక్కువ రోజులు కూర్చుంటే మెడ భాగంలో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు కూడా మెడనొప్పిని కలిగిస్తాయి.
అమెరికాలోని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్‌లో (report) చీఫ్ మెడికల్ ఎడిటర్‌గా పనిచేస్తున్న 'డాక్టర్ హోవార్డ్ E. లెవైన్'.. మెడ నొప్పి తగ్గడానికి కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. అవేంటంటే..
- మెడ నొప్పితో బాధపడేవారు తప్పుడు భంగిమలో కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయకూడదు. మీ కంటి చూపుకి నేరుగా డెస్క్‌టాప్ ఉండాలి.
- అలాగే కీబోర్డ్ చేతికి దగ్గరగా అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ఛైర్లో వంగి కూర్చవడం, మెడని కిందకి లేదా పైకి ఎక్కువ సేపు వంచి చూడడం వల్ల మెడ నొప్పి తీవ్రమవుతుంది. కాబట్టి, మెడనొప్పితో బాధపడేవారు సరైన భంగిమలో కూర్చోవాలి.
- మీకు కంటి అద్దాలుంటే తప్పకుండా వాటిని టైమ్ పీరియడ్ ప్రకారం చెక్ చేసుకోండి. ఎందుకంటే కొందరిలో సైట్ పెరుగుతూ ఉంటుంది. మీరు సరైన గ్లాసెస్ ధరించకపోతే.. తరచూ మెడను వెనుకకు వంచి చూస్తారు. దీనివల్ల మెడనొప్పి పెరుగుతుంది.
- రాత్రి పడుకునే ముందు కొంతమంది రెండు మూడు దిండ్లు ఉపయోగిస్తుంటారు. కానీ, ఈ అలవాటు మంచిది కాదు. దీనివల్ల మెడనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మెత్తగా ఉండే ఒక దిండు పెట్టుకోవడం మంచిది.
- చాలా మందిలో మెడనొప్పి బాధ.. కంటినిండా నిద్రపోతే తగ్గిపోతుంది. కాబట్టి, కనీసం 8 గంటలు నిద్రపోవాలి.
- అయితే, తీవ్రమైన మెడనొప్పితో పాటు జ్వరం, బరువు తగ్గడం, చేతులు, కాళ్లు తిమిర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.