Side Effects of Unsafe Abortions : కొంతమంది అవాంఛిత గర్భం దాల్చినప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోనే అబార్షన్ చేసేసుకుంటారు. అయితే, ఇలాంటి అసురక్షితమైన అబార్షన్ల కారణంగా ఏటా వేల సంఖ్యలో మహిళలు మరణిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ(ప్రపంచ ఆరోగ్య సంస్థ) పేర్కొంటోంది. అంతేకాదు, ఇలాంటి సొంత వైద్యం భవిష్యత్తులో సంతానలేమితో పాటు ఇతర ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకూ కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలోనే అసురక్షితమైన అబార్షన్ల కారణంగా ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలొస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇంట్లోనే అబార్షన్ చేసుకునే క్రమంలో చాలా మంది మహిళలు మాత్రలు వాడడం, లేదంటే ఇతర పరికరాల్ని ఉపయోగించడం చేస్తుంటారు. అయితే, ఇలాంటివి వాడటం వల్ల గర్భాశయం పూర్తిగా శుభ్రపడకపోవచ్చు. ఫలితంగా అధిక రక్తస్రావం, జననాంగాల్లో ఇన్ఫెక్షన్.. వంటి తీవ్ర సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. అంతేకాదు, ఇది క్రమంగా గర్భాశయం వరకు పాకి సంతానలేమికి కూడా దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ మూలంగా రక్తం కలుషితమై ఒకానొక దశలో ప్రాణాంతకం కూడా కావచ్చంటున్నారు. అందుకే, ఇలాంటి అసురక్షిత గర్భస్రావాలకు పూర్తి దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.
అధిక రక్తస్రావంతో ముప్పు!
ఇంట్లో సొంతంగా చేసుకునే అబార్షన్లు అధిక రక్తస్రావానికి దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దీన్నే Hemorrhageగా పేర్కొంటున్నారు. అసురక్షిత పద్ధతుల వల్ల ఒక్కోసారి రక్తనాళాలు డ్యామేజ్ అయి అంతర్గత రక్తస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని సూచిస్తున్నారు. అంతేకాదు, కొన్నిసార్లు ప్రాణాల మీదకు వచ్చే దాకా ఈ సమస్యను గుర్తించలేం అంటున్నారు.
అదేవిధంగా, అబార్షన్ చేసుకోవడమంటే బలవంతంగా నెలసరిని ప్రారంభించడమే! ఈ క్రమంలో అయ్యే బ్లీడింగ్‌ని కంట్రోలన్ చేయడం కూడా కష్టమేనట! ఇలా ఈ రెండు పద్ధతుల కారణంగా అధిక మొత్తంలో రక్తం బయటికి వెళ్లిపోయి రక్తహీనత తలెత్తడంతో పాటు అవయవాలకు రక్తం, ఆక్సిజన్ అందక అవి దెబ్బతినడం, ఒక్కోసారి ప్రాణాలకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్(NIH) పరిశోధకుల బృందం చేపట్టిన ఓ రిసెర్చ్లోనూ అసురక్షితమైన అబార్షన్లు మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
మోతాదుకు మించితే ప్రాణాలకే ప్రమాదం!
కొంతమంది స్వీయ అబార్షన్లలో భాగంగా హెర్బల్ పద్ధతుల్ని అనుసరిస్తుంటారు. ఎందుకంటే ఇవి సహజసిద్ధమైనవే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నది వారి భావన. కానీ, వీటివల్ల కూడా పలు తీవ్ర ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మోతాదుకు మించి వీటిని తీసుకోవడం వల్ల అవి మేలు చేయడానికి బదులు విషపూరితంగా మారి ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశం ఎక్కువ అంటున్నారు. ఈ క్రమంలో వీటిలోని అదనపు టాక్సిన్లు, ఇతర సమ్మేళనాలను వేరు చేసి తొలగించే క్రమంలో లివర్‌పై అధిక ఒత్తిడి పడుతుంది. ఫలితంగా అది డ్యామేజ్ అవడం లేదంటే పూర్తిగా దెబ్బతినే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు!
ఇలా గుర్తించవచ్చు!
ఒకవేళ తెలిసో తెలియకో ఇంట్లోనే స్వీయ గర్భస్రావ పద్ధతులు పాటించినా.. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే అలర్ట్ అయి వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. తద్వారా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చని సూచిస్తున్నారు. అందులో కొన్నింటిని చూస్తే..
- మూత్ర-మల విసర్జన టైమ్‌లో రక్తం కనిపించడం
- గంటగంటకూ శ్యానిటరీ న్యాప్‌కిన్ మార్చుకునేంత రక్తస్రావం అవ్వడం
- పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి
- జ్వరం, ఎక్కువగా చెమటలు పట్టడం
- విపరీతమైన నీరసం/అలసట, స్పృహ కోల్పోవడం
- చర్మం పాలిపోయినట్లుగా/పసుపు రంగులోకి మారడం
ఈవిధమైన లక్షణాలు కనిపిస్తే అనుమానించి వెంటనే వైద్యుల పర్యవేక్షణలో తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కొంతమేర ఫలితం ఉండవచ్చంటున్నారు. అదేవిధంగా, కారణమేదైనప్పటికీ.. సొంతంగా అబార్షన్లు చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకునే కంటే వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే గర్భాన్ని తొలగించుకోవడం ఉత్తమమైన పద్ధతి అని అంటున్నారు నిపుణులు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా?- అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!
అలర్ట్ : థైరాయిడ్ ఉంటే గర్భం ధరించలేరా? - వైద్యులు ఏమంటున్నారో తెలుసా!