High Uric Acid Symptoms :కొంత మందికి రాత్రివేళ పడుకుంటే.. పాదాలు, కీళ్లు, కాళ్లల్లో విపరీతమైన నొప్పి ఉంటుంది. రోజంతా పని ఎక్కువ చేయడం వల్ల ఇలా నొప్పులు వస్తున్నాయని చాలా మంది అంతగా పట్టించుకోకుండా ఉంటారు. కానీ.. ఇలా నైట్ పడుకునే సమయంలో పాదాలలో ఎక్కువ నొప్పి రావడం వెనక కూడా ఒక అనారోగ్య సమస్య ఉండే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తంలో సాధారణం కంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉండడం కారణం కావొచ్చని చెబుతున్నారు. మరి ఈ హెల్త్ ప్రాబ్లమ్‌ను ఎలా తగ్గించుకోవాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యూరిక్ యాసిడ్ :సాధారణంగా మనం మూత్రవిసర్జన చేసినప్పుడు శరీరం నుంచి యూరిక్ యాసిడ్ బయటకు వెళ్తుంది. కానీ.. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే.. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. ఈ పరిస్థితిని 'హైపర్ యూరిసెమియా' అంటారు. మన శరీరంలో ప్యూరిన్స్ అనే పదార్థాలు విచ్ఛిన్నమైనప్పుడు ఉత్పత్తి అయ్యే ఒక రసాయనాన్నే యూరిక్ యాసిడ్ అంటారు.
ఈ యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కడైనా ఏర్పడుతుంది. ఎక్కువగా కీళ్లు, మూత్రపిండాల చుట్టూ ఫామ్ అవుతుందని నిపుణులంటున్నారు. శరీరంలో ఈ యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల గుండె జబ్బులు, షుగర్ వ్యాధి, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగినట్టు చెప్పే సంకేతాలు..
- హైపర్ యూరిసెమియాతో బాధపడుతున్న వారిలో మూడింట ఒక వంతు మందికి మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
- హైపర్ యూరిసెమియా సమస్యతో బాధపడేవారిలో కీళ్లు, పాదాలు, కాళ్లు వాపు వస్తాయట. అలాగే నొప్పులు కూడా ఉంటాయట.
- అలాగే రాత్రి పడుకున్న సమయంలో పాదాలలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. 2016లో రుమటాలజీ ఇంటర్నేషనల్ (Rheumatology International) జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం, రక్తంలో హై యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉన్న వ్యక్తులలో రాత్రి పడుకునే సమయంలో పాదాలలో పెయిన్ ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారట.
- కొంత మందిలో అరికాళ్లలో మంటలు కూడా ఉంటాయట. అలాగే కాలి బొటన వేలు నొప్పిగా ఉంటుందట.
- ఈ నొప్పులు 12-14 గంటల వరకూ వేధించవచ్చని అంటున్నారు.
- నిరంతరం మూత్ర విసర్జన చేయడం, మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది కూడా కలుగుతుంది.