High Sugar Effects the Brain Health: మన శరీరంలో అత్యంత ముఖ్యమైన పార్ట్.. బ్రెయిన్. అది ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా సక్రమంగా చేయగలుగుతాం. దాని ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అయితే.. ఇంత ముఖ్యమైన బ్రెయిన్ ఆరోగ్యాన్ని చాలా మంది చేజేతులా దెబ్బ తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రధానమైనది తినే ఆహారమని అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
చక్కెర ఉండే ఫుడ్స్ ఎంత తీసుకుంటే.. మెదడుపై అంత ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్ హెచ్చుతగ్గులకు చక్కెర కారణమవుతుందని.. వాపు, ఇన్సులిన్ నిరోధకత వంటి పరిస్థితులకు కారణమవుతుందని అంటున్నారు. ఈ పరిస్థితులన్నీ కలిసి మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు.
2016లో "అల్జీమర్స్ డిసీజ్ ఎండ్ డెమెన్షియా" అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. అధిక చక్కెర కలిగిన ఆహారాన్ని తినే వ్యక్తులలో అల్జీమర్స్ వ్యాధి(National Institute of Health రిపోర్ట్) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూకేలోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయంలో న్యూరోసైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ మైఖేల్ మోస్ పాల్గొన్నారు. అధిక చక్కెర వినియోగం మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.
చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల కలిగే మరికొన్ని నష్టాలు:
ఆందోళన:అధిక చక్కెర వినియోగం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో స్పైక్స్, క్రాష్‌లకు దారితీస్తుందని.. అలాగే డోపమైన్, సెరోటోనిన్ వంటి మానసిక స్థితిని నియంత్రించే కీలకమైన న్యూరోట్రాన్స్‌మిటర్ల సమతుల్యతను దెబ్బతీస్తుందని అంటున్నారు. దీని ఫలితంగా మానసిక కల్లోలం, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు.
అభిజ్ఞా పనితీరు తగ్గుదల: చక్కెరలో అధికంగా ఉండే ఆహారం ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఇది మెదడుకు అవసరమైన గ్లూకోజ్‌ను సరిగ్గా ఉపయోగించుకోకుండా చేస్తుంది. దీంతో మనం మరచిపోవడం, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చంటున్నారు. అలాగే న్యూరోడైజెనరేటివ్ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
గతంలో మాదిరిగా ఏమీ గుర్తుండట్లేదా? - ఈ 5 పనులు చేస్తే చాలు - మీ "బ్రెయిన్ పవర్" జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది!
మెదడు కణాలు నశించడం: అధిక చక్కెర మెదడులోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీంతో మెదడు కణాలకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా అందవు. ఫలితంగా మెదడు కణాలు నశించిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే అధిక చక్కెర వల్ల మెదడులో వాపు ఏర్పడే ప్రమాదం ఉందని.. ఇది మెదడు పనితీరును ప్రభావితం చేస్తుందని అంటున్నారు.
సెల్యూలర్ దెబ్బతింటుంది:అధిక చక్కెర తీసుకోవడం మెదడులో తాపజనక ప్రతిస్పందనల(Inflammatory Responses) క్యాస్కేడ్‌ను ప్రేరేపిస్తుందని.. ఇది సెల్యులార్ దెబ్బతినడానికి, అభిజ్ఞా క్షీణతకు దారితీస్తుందని చెబుతున్నారు. అలాగే అధిక చక్కర కలిగిన ఆహారం బ్రెయిన్ సినాప్టిక్ కమ్యూనికేషన్‌లో జోక్యం చేసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యాలను దెబ్బతీస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
పిల్లల్లో వెరీ డేంజర్:పెద్దలతో పోలిస్తే పిల్లలలో.. అధిక చక్కెర తీసుకోవడం ఆందోళన కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇలా తీసుకోవడం వల్ల అభివృద్ధి సమస్యలు, శ్రద్ధ లోపాలు, రాజీపడే అభ్యాస సామర్థ్యాలకు దారితీస్తుందని అంటున్నారు. అందువల్ల, మీ ఆహారం నుంచి శుద్ధి చేసిన లేదా ప్రాసెస్ చేయబడిన చక్కెరలను తగ్గించడం అనేది సరైన మెదడు ఆరోగ్యాన్ని మొత్తం శ్రేయస్సును నిర్వహించడానికి కీలకమని సూచిస్తున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.