తెలంగాణ

telangana

ETV Bharat / health

బీపీ ఎక్కువవుతోందా? - ఈ డైట్ పాటిస్తే ఆల్​ సెట్ అంటున్న నిపుణులు! - HIGH BLOOD PRESSURE DIET FOODS

-అధిక రక్తపోటు సమస్యకు ఈ ఆహారంతో పరిష్కారం -ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవాలని వైద్యుల సలహా

High Blood Pressure Diet Foods
High Blood Pressure Diet Foods (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Oct 24, 2024, 2:06 PM IST

High Blood Pressure Diet Foods:ప్రస్తుత ఆధునిక సమాజంలో అనేక మంది అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారు. బిజీ లైఫ్​స్టైల్​తో పాటు ఒత్తిళ్లతో కూడుకున్న ఉద్యోగాలు చేస్తుండడం వల్ల ఈ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఉద్యోగులు హై బీపీ బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే హై బీపీ సమస్యతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఆహారంలో కొన్ని మార్పులు చేయాలని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జానకీ శ్రీనాథ్ చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక రక్తపోటు సమస్యకు అనారోగ్యం, జీవనశైలి, జన్యువులు, కుటుంబ చరిత్ర, బరువుతో పాటు శరీరంలో కొవ్వు మోతాదు ఎక్కువగా ఉండటం వంటివి కారణం అవుతుంటాయని డాక్టర్ జానకీ శ్రీనాథ్ వివరిస్తున్నారు. అలానే, మనం సమస్యలను అధిగమించే తీరు, ఆందోళన, ఒత్తిడి లాంటివి కూడా అధిక రక్తపోటుపై ప్రభావం చూపిస్తాయంటున్నారు. అందుకే, ముందుగా మన శరీర అవసరాలని గుర్తించిన తర్వాత అందుకు తగ్గట్లుగా పోషకాలను తీసుకుంటూ వ్యాయామాలూ చేస్తే ఈ సమస్యను అధిగమించొచ్చని సలహా ఇస్తున్నారు.

ఇంకా ఆరోగ్యంగా ఉన్న సాధారణ వ్యక్తికి రోజూ చెంచా ఉప్పు తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఇతర ఖనిజాలు కూడా శరీరానికి అందాలని అంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఆహారంలో మేలైన కొవ్వుల మోతాదుని పెంచుకోవడంతోపాటు విటమిన్‌ ఇ, సి, సెలీనియం, జింక్‌ వంటి పోషకాలు అవసరం అని వెల్లడిస్తున్నారు. ఫోలిక్‌ యాసిడ్, ఫైటోకెమికల్స్‌ రక్తాన్ని చిక్కబడనివ్వవకుండా కాపాడుతాయని వివరిస్తున్నారు.

ఇందుకోసం సరైన ఆహారపు అలవాట్లను అలవరుచుకోవాలని సూచిస్తున్నారు. పొట్టుతో ఉన్న గింజధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, అల్లం, వెల్లుల్లి వంటివి తీసుకోవాలని చెబుతున్నారు. అలానే, రోజూ కనీసం ముప్పై గ్రాముల నూనెగింజలు, నట్స్‌ తినాలని.. రోజుకి నాలుగైదు చెంచాలకు మించి నూనె వాడకూడదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రైస్‌బ్రాన్, నువ్వులు, ఆవ నూనెల్ని వినియోగించడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ ఉడికించని ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

సలాడ్స్‌, నాటుకోడి, చేప తినొచ్చని అంటున్నారు. కాల్షియం కూడా అధిక రక్తపోటుని అదుపులో ఉంచగలదని.. అందుకే వీటి మీద దృష్టిపెట్టడంతో పాటు బరువునీ తగ్గించుకోవాలని అంటున్నారు. ఒత్తిడిని నియంత్రించుకోవడమే కాకుండా వీటితో పాటు రోజూ వ్యాయామం చేయడం, శరీరానికి తగిన విశ్రాంతి తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొంటున్నారు. ఈ అలవాట్లన్నీ పాటిస్తే అధిక రక్తపోటుసమస్య రాకుండా చూసుకోవచ్చని తెలుపుతున్నారు.

NOTE:ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది

పిల్లల్లో విటమిన్ "డి" తగ్గితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవట! - రీసెర్చ్​లో ఆసక్తికర విషయాలు వెల్లడి

విరేచనాల సమస్యతో బాధపడుతున్నారా? - ఈ పానీయం తాగితే పూర్తిగా తగ్గిపోతుందట!

ABOUT THE AUTHOR

...view details