How To Check Adulteration In Black Pepper : అగ్గిపుల్ల సబ్బుబిళ్ల కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు, నేడు మనం వాడే వస్తువుల్లో ప్రతీది కల్తి అవుతునే ఉంది. తాగే పాల నుంచి తినే ఆహారం వరకూ ప్రతిరోజు ఎక్కడో ఒక చోట కల్తీ గురించిన వార్తలు వింటుంటాం. అయితే, కొన్ని వస్తువులు కల్తీ అయినట్లు మనం నేరుగా తెలుసుకోలేం. ప్రయోగశాలలో పరిశీలిస్తే తప్ప అలాంటి వాటిలో కల్తీ జరిగినట్లు స్పష్టంగా తెలియదు. మనం నిత్యం తినే ఆహారం కల్తీ అయిన విషయం తెలుసుకోవడంలో కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ వస్తువులు కల్తీ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. తద్వారా నాణ్యమైన ఆహారం తీసుకోవచ్చు అంటున్నారు. అలాంటి ఆహార పదార్థాల్లో మిరియాలు కూడా ఒకటి. మిరియాలలో కల్తీ జరిగిందో లేదో ఎలా తెలుసుకోవాలి. 'భారత ఆహార పరిరక్షణ, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)' ఏం చెబుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కల్తీని కనిపెట్టేందుకు : కల్తీ ఉత్పత్తులు, రసాయనాలతో కూడినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఈ కల్తీలను గుర్తించడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ తరచూ కొన్ని చిట్కాలు వెల్లడిస్తుంది. ‘డిటెక్టింగ్ ఫుడ్ అడల్ర్టెంట్స్’ పేరుతో సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలు పంచుకుంది. వీటి ద్వారా మనం తీసుకునే ఆహార పదార్థాలు మంచివా? కల్తీవా? అనే విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా నల్ల మిరియాల గురించి ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించిన కొన్ని విషయాలు.
నల్ల మిరియాల్లో వీటిని మిక్స్ చేశారా? :సుగంధ ద్రవ్యాల్లో నల్ల మిరియాలను రారాజుగా చెప్పుకుంటారు. వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం తెలిసిందే. అందుకే ప్రతి వంటింట్లో వీటికి కచ్చితంగా ప్రత్యేక స్థానముంటుంది. అయితే మిరియాలకు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు వీటిలో ఎండిన బ్లాక్ బెర్రీ (నల్ల నేరేడు)ని మిక్స్ చేసి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మరికొందరైతే బొప్పాయి గింజలు కూడా కలుపుతుంటారు. ఇవి చూడడానికి అచ్చం నల్ల మిరియాల మాదిరిగా ఉంటాయి. అందుకే వీటిని కొనుగోలు చేసేటప్పుడు అసలు గుర్తుపట్టలేం. ఈ నేపథ్యంలో నల్ల మిరియాల్లోని కల్తీని సులభంగా కనిపెట్టేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజాగా ఓ సింపుల్ చిట్కాను వెల్లడించింది.
ఎండిన బ్లాక్‌బెర్రీలతో :కొన్ని మిరియాలను టేబుల్‌పై ఉంచి బొటనవేలితో నొక్కాలి. ఒరిజినల్ మిరియాలు కొంచెం గట్టిగా ఉంటాయి. అంత సులభంగా విరగవు. ఒకవేళ విరిగితే, అందులో ఎండిన బ్లాక్‌బెర్రీ పండ్లను కలిపినట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.