Heated Car Seats Effects on Men Fertility :నగరాల్లో నివసించే వారిలో దాదాపుగా ప్రతి ఒక్కరికి కార్లు, బైక్‌లు ఉన్నాయి. దగ్గరి ప్రయాణాల నుంచి దూరం ప్రయాణాల వరకు వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే.. ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట. పురుషుల విషయానికి వస్తే.. ఏకంగా సంతానోత్పత్తిపైనా తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు.
కొన్ని పరిశోధనల ప్రకారం.. ఎక్కువసేపు డ్రైవింగ్ సీట్లో కూర్చోవడం వల్ల.. ఊబకాయం, గుండె పోటు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట. ఈ వ్యాధులే కాకుండా.. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాళ్ల నొప్పులు, వెరికోస్ వెయిన్స్, కాళ్లలో వాపులు మొదలవుతాయి. అంతేకాకుండా కాళ్లలో రక్తం గడ్డకట్టడం కూడా జరుగుతుందట. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే మరొక సాధారణ సమస్య వెన్నునొప్పి. ఇవన్నీ చాలా మందికి తెలుసు. కానీ.. పురుషుల్లో స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుందన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు. జర్మనీలోని గిస్సెన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయం చెబుతున్నారు.
Male Contraceptive ICMR : పురుషులకు సంతాన నిరోధక ఇంజెక్షన్.. ట్రయల్స్ సక్సెస్! 99% మెరుగైన పనితీరు
ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి కావడానికి.. పురుషుల వృషణాల వద్ద వాతావరణం చల్లగా ఉండాలి. హెల్దీ స్పెర్మ్ కోసం.. 35 లేదా 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మించ కూడదు. అంతకుమించి వృషణాలు వేడికి గురైతే.. సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. మరి.. దీనికీ కారు సీటుకు సంబంధం ఏమంటే.. సీట్ల తయారీ కోసం వినియోగించే రెగ్జిన్, ఇతర పదార్థాలు ఎక్కువ వేడిని పుట్టిస్తాయి. ఇలాంటి సీట్ల మీద ఎక్కువ సేపు కూర్చుంటే.. గాలి ఆడకపోవడం వల్ల వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆ వేడి వృషణాల మీద ఎఫెక్ట్ చూపుతుందని.. అంతిమంగా వీర్యకణాల మీద పడుతుందని చెబుతున్నారు.
ఈ విషయం తెలుసుకునేందుకు పరిశోధకులు.. 30 మంది పురుషుల స్క్రోటమ్(వృషణాలు)లకు టెంపరేచర్ సెన్సార్లను అమర్చగా.. ఒక్కొక్కరు గంటన్నర సేపు కార్లలోని సీట్లపై కూర్చున్నారు. ఒక గంటలో స్క్రోటల్ టెంపరేచర్ సగటున 37.3 డిగ్రీల సెల్సియస్‌కు పెరగగా.. ఒక వ్యక్తిలో గరిష్ఠంగా 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. అదే నార్మల్ సీట్లపై కూర్చుంటే ఉష్ణోగ్రత 36.7 డిగ్రీల సెల్సియస్‌కు చేరిందని వారు తెలిపారు. అధిక వేడి పుట్టించే సీట్లపై కూర్చోవడం నిరంతరంగా కొనసాగితే.. స్మెర్మ్ కౌంట్ తగ్గిపోవడంతోపాటు దీర్ఘకాలంలో అంగస్తంభన సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.