Heart Attack Symptoms in Women: ఒకప్పుడు గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు 60 సంవత్సరాలు దాటిన తర్వాతే కనిపించేవి. కానీ ఈ రోజుల్లో అరవైలో వచ్చే వ్యాధులు.. ఇరవైలోనే దాడి చేసి ప్రాణాలను మధ్యలోనే హరిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా 85 శాతం మరణాలు గుండెపోటు వల్ల సంభవిస్తున్నాయని స్పష్టం చేసింది. ఈ ప్రమాదాన్ని శరీరం చేసే ముందస్తు హెచ్చరికల ద్వారా గుర్తించి, బయటపడాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే.. తాజా సమాచారం ఏమంటే.. గుండెపోటు లక్షణాలు పురుషులు, మహిళల్లో వేర్వేరుగా ఉంటాయట! మరి, ఆ లక్షణాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
గుండె పోటు ఎందుకు వస్తుంది?:గుండెకు నిరంతరాయంగా రక్తం సరఫరా అవుతూ ఉండాలి. సరఫరా ఏ మాత్రం నిలిచినా శరీరంలోని మొత్తం వ్యవస్థ స్తంభించిపోతుంది. గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడానికి ప్రధాన కారణం కొవ్వు. రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల గోడల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో రక్తం ప్రవహించే మార్గం కుంచించుకుపోతుంది. దీనివల్ల గుండెకు రక్తసరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా గుండె కండరాలకు ఆక్సిజన్, పోషకాలు అందవు. దీంతో కండరాలు చచ్చుబడి గుండె పోటు ఏర్పడుతుంది.
హార్ట్ అటాక్ వచ్చినవారు ఎక్సర్సైజ్ చేయొచ్చా? వైద్యులేం చెబుతున్నారు ?
మహిళల్లో గుండెపోటు కారకాలు: పురుషులతో పోలిస్తే స్త్రీలు సాధారణంగా ఇరుకైన రక్త ధమనులను కలిగి ఉంటారు. ఈ జీవ వైవిధ్యాలు పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె జబ్బుల పురోగతిలో తేడాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, మానసిక ఒత్తిడి, నిరాశ, వంటి కొన్ని కారకాలు కూడా మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే మెనోపాజ్, బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్, గర్భధారణ సమస్యలు వంటి పరిస్థితులు కూడా గుండె జబ్బుల ప్రమాదానికి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.