Healthy Snacks for Children in Summer : వేసవిలో పిల్లలకు సమతుల ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యమంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఇందుకోసం కొన్ని స్నాక్స్(Snacks) సూచిస్తున్నారు. మరి.. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బ్రేక్ ఫాస్ట్ స్మూతీస్ : మీ పిల్లలను సమ్మర్లో హెల్తీగా ఉంచడంలో స్మూతీలు చాలా బాగా ఉపయోగపడుతాయి. పండ్లు, కూరగాయలు, పాలు ఇతర పదార్థాలను ఉపయోగించి ప్రిపేర్ చేసే స్మూతీలలో విటమిన్లు, ప్రొటీన్స్, ఖనిజాలు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వేసవిలో పిల్లలను హైడ్రేట్‌గా ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. కాబట్టి, మీ పిల్లలకు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌గా వీటిని ప్రిపేర్ చేసి అందించండి. రోజంతా యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉంటారు.
ఫ్రూట్ కబాబ్స్ :ఫ్రూట్ కబాబ్స్ కూడా వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. పోషకాలతో నిండి రుచికరంగా ఉండే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. వారు ఆనందించే విధంగా ఇంద్రధనస్సు క్రమంలో ఈ ఫ్రూట్ కబాబ్‌లను తయారుచేసి ఇవ్వండి. ఎరుపు, ఆకుపచ్చ ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, పైనాపిల్స్, మామిడి పండ్లతో పాటు మరికొన్ని పండ్లను ఉపయోగించి ఈ కబాబ్స్ రెడీ చేసి మీ పిల్లలకు అందించండి.
వాటర్ మిలన్ పాప్సికల్స్ :సమ్మర్ వచ్చిందంటే చాలా మంది తప్పకుండా తినే పండు పుచ్చకాయ. 92% నీటితో కూడి ఉండే ఈ పండు.. వేసవిలో పిల్లలను హైడ్రేట్‌గా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. అయితే, నార్మల్‌గా పిల్లలు తినడానికి ఇంట్రస్ట్ చూపించకపోవచ్చు. కాబట్టి, దీనిని పాప్సికల్స్గా చేసి పిల్లలకు స్నాక్స్ రూపంలో అందించండి. చాలా ఇష్టంగా తింటారు.