తెలంగాణ

telangana

ETV Bharat / health

బరువు తగ్గేందుకు ఈ చపాతీలు సూపర్ ఆప్షన్! - షుగర్​ కూడా తగ్గుతుందట! - HEALTHY FLOURS TO WEIGHT LOSS

- పలు ధాన్యాలను సూచిస్తున్న నిపుణులు - ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చని సూచన

Healthy Flours to Weight Loss
Healthy Flours to Weight Loss (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 27, 2024, 2:05 PM IST

Healthy Flours to Weight Loss:ప్రస్తుత రోజుల్లో అధిక బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో బరువు తగ్గడానికి కొంతమంది రోజూ చపాతీ తింటుంటారు. చపాతీ అనగానే గోధుమ పిండితో చేసుకునే వారే ఎక్కువ. కానీ ఇదొక్కటే కాదు.. వివిధ రకాల ధాన్యాలతో చేసిన చపాతీలు అధిక బరువును తగ్గించి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయని అంటున్నారు. ఇంతకీ ఆ చపాతీలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

సజ్జ పిండి:కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఐరన్‌, సోడియం.. వంటి పోషకాలు పుష్కలంగా లభించే సజ్జలు బరువు తగ్గాలనుకునే వారికి చక్కటి ఆహారమని నిపుణులు అంటున్నారు. వీటిలో ఉండే ఫైబర్‌ జీర్ణశక్తిని పెంచుతుందని చెబుతున్నారు. అలాగే.. శరీరంలోని కొవ్వుల్ని కరిగించడంతోపాటు రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపు చేసి మధుమేహులకూ మంచి చేస్తాయంటున్నారు. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పునూ ఇవి దూరం చేస్తాయని చెబుతున్నారు. కాబట్టి సజ్జ పిండితోనూ రోటీ తయారు చేసుకొని.. కాయగూరలు/పప్పుతో తీసుకోవచ్చంటున్నారు. అయితే గోధుమపిండి చపాతీతో పోల్చితే.. పూర్తిగా సజ్జ పిండి ఉపయోగించి తయారు చేసిన రోటీలు కాస్త గట్టిగా, మందంగా వస్తాయి. ఇలాంటివి ఇష్టపడని వారు గోధుమ పిండి, సజ్జ పిండి సమానంగా కలిపి కూడా చపాతీలు చేసుకుని తినవచ్చంటున్నారు.

జొన్న పిండి: గోధుమ పిండి తర్వాత చాలా మంది జొన్న రొట్టెలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక జొన్నల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సహా క్యాలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బరువు పెరగకుండా జాగ్రత్తపడవచ్చని చెబుతున్నారు. అలాగే ఇందులోని విటమిన్‌ ‘బి’ కణజాల వృద్ధికి తోడ్పడుతుందని.. ప్రొటీన్లు, కాల్షియం, కాపర్‌, జింక్‌, పొటాషియం.. వంటి పోషకాలు అధికంగా ఉండే జొన్నలు.. రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపు చేస్తాయంటున్నారు నిపుణులు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు, డయాబెటిస్​తో బాధపడేవారు జొన్న పిండితో చేసిన రొట్టెను రోజూ ఒక పూట తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​కు సంబంధించిన నేషనల్​ లైబ్రరీ ఆఫ్​ మెడిసిన్​ ప్రచురించింది(రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి).

ఓట్స్‌ పిండి: బరువు తగ్గాలనుకునే వారి డైట్‌లో ఓట్స్​ తప్పకుండా ఉంటాయి. అయితే.. చాలా మంది ఓట్స్‌ను పాలలో ఉడికించి తీసుకోవడం, ఓట్స్‌తో ఉప్మా, దోసె.. వంటివి తయారు చేసుకొని తింటుంటారు. వీటితో పాటు ఓట్స్‌ పిండితో మెత్తని, రుచికరమైన చపాతీలు కూడా తయారుచేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఇంట్లో ఉన్న ఓట్స్‌నే మెత్తగా గ్రైండ్‌ చేసుకోవడం లేదంటే మార్కెట్లో దొరికే ఓట్స్‌ పిండిని ఉపయోగించుకోవచ్చంటున్నారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయని.. పైగా ఇది గ్లూటెన్‌ రహిత పదార్థం.. అంటున్నారు. అలాగే ఇందులోని పోషకాలు శరీరంలో చక్కెర స్థాయుల్ని క్రమబద్ధీకరించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని.. బాడీలో పేరుకున్న కొవ్వుల్ని కరిగించి బరువు తగ్గడంలోనూ సహకరిస్తాయని పలు అధ్యయనాల్లో తేలినట్లు వివరిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అన్నం లేదా చపాతీ - షుగర్​ తగ్గేందుకు ఏది తింటే మంచిది? - నిపుణుల సమాధానమిదే!

బరువు తగ్గడం నుంచి షుగర్​ కంట్రోల్​ వరకు - నల్ల జీలకర్రతో అద్భుత ప్రయోజనాలట! - ఎలా తీసుకోవాలో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details