Health Benefits Of Snake Gourd :పొట్లకాయ.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పొడవుగా ఉండే ఈ కాయను కొందరు ఇష్టంగా తింటే.. ఇంకొందరు మాత్రం దగ్గరకు కూడా రానివ్వరు.ఇక ఇంట్లో వండిన రోజయితే అమ్మల మీద చాలా మంది యుద్ధమే చేస్తారు. అయితే పొట్లకాయను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇష్టం లేని వారు కూడా ఆహారంలోభాగం చేసుకుంటారని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పొట్లకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :
- పొట్లకాయలో శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ఫాస్పరస్, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, ఇనుము, మెగ్నీషియం, అయోడిన్, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
- అలాగే ఇందులో విటమిన్ ఎ, ఇ, బి6, సి వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ జీవక్రియలను సక్రమంగా నిర్వహించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
- పొట్లకాయలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.
- మలబద్ధకం సమస్యతో బాధపడే వారు రోజూ రెండు స్పూన్ల పొట్లకాయ రసం తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ఇందులో ఉండే ఫైబర్ ఈ సమస్యను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుందని నిపుణులంటున్నారు. పొట్లకాయ తినడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి ఇతర సమస్యలను కూడా తగ్గించుకోవచ్చంటున్నారు.
- బరువు తగ్గాలనుకునే వారు దీనిని తినడం వల్ల తొందరగా ఆకలి కాకుండా, కడుపు నిండిన భావన కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
- పొట్లకాయలో ఉండే అమైన్‌లు, ఫ్లేవనాయిడ్‌లు మెదడు నరాల కణాలను ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తాయి. అలాగే నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుందని తెలియజేస్తున్నారు.
- పొట్లకాయలో కొలెస్ట్రాల్ కంటెంట్ సున్నా. కాబట్టి గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం. వీరు భోజనంలో ఉడకబెట్టిన పొట్లకాయను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని సూచిస్తున్నారు.
- కిడ్నీలో రాళ్లు, ఇతర వ్యర్థాలను తొలగించడంలో పొట్లకాయ ఎంతో ఉపయోగపడతుందని అంటున్నారు. ఇది మంచి కిడ్నీ డిటాక్సిఫైయర్‌గా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాలు, మూత్రాశయం పనితీరు మెరుగుపడటానికి పొట్లకాయ రసం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
పరిశోధన వివరాలు :2010లో జరిగిన క్లినికల్ జర్నల్ ఆఫ్ ది అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ (Clinical Journal of the American Society of Nephrology) ప్రకారం పొట్లకాయ తినడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే పొట్లకాయ రసం తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గిపోతుందని వెల్లడించారు.