Health Benefits of Puffed Rice :మరమరాలను పలుప్రాంతాల్లో.. వివిధ పేర్లతో పిలుస్తారు. పేలాలు, బొరుగులు, బొంగు పేలాలు, ముర్ముర్లు, మురీలు అని రకరకాల పేర్లతో పిలుస్తారు. బియ్యాన్ని(Rice) అధిక పీడనానికి గురిచేయడం ద్వారా ఈ మరమరాలను తయారు చేస్తారు. అందుకే.. వీటిని పఫ్డ్ రైస్ అని కూడా పిలుస్తారు. ఈ మరమరాలు సాధారణ బియ్యం కన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయని, తరచుగా తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ.. వీటిని తినడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కేలరీలు తక్కువ : మరమరాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గాలనుకునే వారికి, తక్కువ కేలరీల ఆహారం తీసుకోవాలనుకునే వారికి మంచి ఆరోగ్యకరమైన ఎంపిక అని చెబుతున్నారు నిపుణులు. వీటిని స్నాక్స్, టిఫిన్స్ రూపంలో తీసుకోవడం వల్ల ఆకలి తగ్గడమే కాకుండా బరువు కూడా పెరిగే ప్రమాదం ఉండదని సూచిస్తున్నారు.
గ్లూటెన్-ఫ్రీ :సహజంగా పఫ్డ్ రైస్ గ్లూటెన్ రహితంగా ఉంటుంది. ఇవి గ్లూటెన్ తినడానికి ఇష్టపడని వారు లేదా ఉదరకుహర వ్యాధి ఉన్న వ్యక్తులకు చక్కటి ఫుడ్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరమరాలలో విటమిన్ డి, విటమిన్ బి, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
కార్బోహైడ్రేట్లు అధికం : మరమరాలలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. గ్లైకోజెన్ నిల్వలు, కండరాలకు తిరిగి శక్తిని అందించడానికి వర్కౌట్‌లకు ముందు లేదా తర్వాత వీటిని తీసుకోవడం మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.