Health Benefits Of Pickles :ఇండియన్ కిచెన్లలో ఏం ఉన్నా, లేకున్నా పచ్చళ్లు మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. ఇంట్లో కూరలు లేకున్నా, సడెన్‌గా వండుకునే సమయం లేకున్నా, టక్కున మనల్ని ఆకలి నుంచి ఆదుకునేది ఈ పచ్చళ్లే మరి. ఇవి కేవలం ఆకలిని తీర్చడమే కాదు, అమోఘమైన రుచిని కూడా అందిస్తాయి. అందుకే వీటిని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా వేసవిలో ఎక్కువ మంది పెట్టుకునే ఆవకాయ పచ్చడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంట. దీని రుచి, వాసన - అబ్బో మాట్లాడుకుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ యమ్మీ అండ్ టేస్టీ పచ్చళ్లలో పోషక విలువలు కూడా ఎక్కువేనట. వీటిని మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మీకు ఏంఏం ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?
1. ప్రోబయోటిక్స్ : నిల్వ పచ్చళ్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయట. ఈ పులయబెట్టిన ఆహార పదార్థాలు ప్రోబయోటిక్లకు సూపర్ ఫుడ్లు. ఇవి ప్రేగుల మైక్రోబయోమ్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. నిల్వ పచ్చళ్లలో వేసే మసాలాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.
2. యాంటీ ఆక్సిడెంట్స్ : ఉడికించకుండా పచ్చిగా నిల్వ చేయబడతాయి కాబట్టి పచ్చళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌ను కాపాడే అవసరమైన సూక్ష్మ పోషకాలు కలిగి ఉంటాయి. వృద్ధాప్య ప్రక్రియను కూడా ఇవి సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే ఊరగాయ, ఆవకాయ, టమాట వంటి నిల్వ పచ్చళ్ల వినియోగం సెల్యులార్ మెటబాలిజం ప్రభావాల నుంచి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
3. విటమిన్లు, ఖనిజాలకు మూలం :పండని కూరగాలతో పాటు కొత్తిమీర, మెంతులు, ఆవాలు, కరివేపాకు లాంటి వాటితో చేసే పచ్చళ్లలో విటమిన్-సి, విటమిన్-ఏ, విటమిన్-కె లాంటి ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇనుము, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఇందులో ఎక్కువగానే లభిస్తాయి.